చెప్పుకో‘లేఖ’ సోనియాకు టి.కాంగ్రెస్‌ ఉత్తరం

తెలంగాణకు ప్రత్యామ్నాయం లేదు
30న భారీ బహిరంగ సభ : జానారెడ్డి
హైదరాబాద్‌, జూన్‌ 18 (జనంసాక్షి) :
టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో అసెంబ్లీ తర్వాతి పరిణామాలతో కంగుతిన్న టీ కాంగ్రెస్‌ నేతలు దానిపై ఏమీ చెప్పుకోలేక పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తప్ప తెలంగాణకు మరో ప్రత్యామ్నాయం లేనే లేదని, రాష్ట్రం ఏర్పాటు చేసి ప్రజల మనోభావాలను గౌరవించాలని కోరుతూ టీ కాంగ్రెస్‌ సమావేశం తీర్మానించింది. చలో అసెంబ్లీ కార్యక్రమం విజయవంతం కావడంతో వణుకు పుట్టిన కాంగ్రెస్‌ నేతలు ప్రత్యక్షంగా ఉద్యమాలు చేయని పక్షంలో ప్రజల్లోకి వెల్లడం కష్టమనే భావనకు వచ్చారు. ఈమేరకు జానారెడ్డి నేతృత్వంలో మంగళవారం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో పలు తీర్మానాలను చేసి హైకమాండ్‌కు వినతి పత్రం పంపించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం జనారెడ్డి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడిరచారు. ఈనెల 30న నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. రాష్ట్ర రాజకీయాలపై విశేష అనుభవం ఉన్న దిగ్విజయ్‌సింగ్‌ను ఇన్‌చార్జ్జిగా నియమించడాన్ని సమావేశం స్వాగతించిందన్నారు. ఆయన తనకున్న అపార అనుభవాన్ని వినియోగించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరనున్నామన్నారు. కాంగ్రెస్‌ ప్రజలకిచ్చిన మాటను తప్పి మరో విదానాన్ని తీసుకుంటే ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని జానా రెడ్డి పేర్కొన్నారు. సోనియాగాంధీపై పూర్తి విశ్వాసం ఉందని తెలంగాణా రాష్ట్రం ఇచ్చి తీరుతుందన్నారు. తెలంగాణకోసం కొన్ని పార్టీలు, సంస్థలు చేస్తున్న ఆందోళనలు జరుగుతున్నా కూడా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాలను సైతం ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసే వరకు కాంగ్రెస్‌ నేతలంతా సమిష్టిగా పోరాటం చేయాలని నిర్ణయానికి వచ్చామన్నారు. అయితే సమావేశంలో పాల్గొన్న డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ తెలంగాణ కోసం అవసరమైతే పోటీకి దూరంగా ఉందామని ప్రతిపాదన చేశారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ అవసరమైతే తెలంగాణలోని నేతలంతా పదవులకు దూరంగా ఉండాలని సూచించారు. అయితే సమావేశంలో పాల్గొన్న వారంతా ప్రజల్లో తిరగలేకపోతున్నామని, అధిష్టానం నిర్ణయాన్ని ఆలస్యం చేయడం వల్ల తీవ్ర నష్టం కలుగుతోందనే భావనను వ్యక్తం చేశారు. అవసరమైతే పార్టీని కూడా వీడేందుకు సిద్ధంగా ఉండాలనే ప్రతిపాదనలను చాలా మంది నేతలు సమావేశంలో వ్యక్తం చేసినట్లు సమాచారం. కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణా నేతలను చిన్న చూపుచూస్తోందనే భావనను వ్యక్తం చేశారు. మంత్రి పదవులను కేవలం సీమాంధ్రకు కట్టబెట్టి తెలంగాణకు చెందిన ఎంపీలను అగౌరవ పరిచిందనే భావనను కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం. అధిష్టానం వద్ద అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధం అవుదామనే ప్రతిపాదనను సైతం చాలామంది నేతలు వ్యక్తం చేసినట్లు సమాచారం. రోజురోజుకు వాయిదా వేస్తూ వస్తున్నందున రానున్న ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ అభ్యర్థులు గెలువడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలు తెలంగాణాలో కాంగ్రెస్‌ను ఇప్పటికే నమ్మే పరిస్థితిలో లేరని, ప్యాకేజీలు, అభివృద్ధి నినాదాలు వినిపిస్తున్న సమయంలో మరింత వ్యతిరేకత ఏర్పడుతుందని, ఈవ్యవహారంలో హైకమాండ్‌ను కలిసి వాస్తవ పరిస్థితులు చెప్పాలని ముక్తకంఠంతో అభిప్రాయం వ్యక్తం చేశారు.