చెరకు రైతులకు బెయిల్‌ ఔట్‌ పథకం?

న్యూఢిల్లీ,జూన్‌5(జనం సాక్షి): ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలు, పలు రాష్ట్రాల్లో రైతుల ఆందోళనల నేపథ్యంలో రైతులకు రాయితీలు ప్రకటించేలా కేంద్రం కసరత్తు చేస్తోందని సమాచారం. ఇందులో భాగంగా చెరుకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించబోనున్నట్లు సమాచారం. సుమారు 8వేల కోట్ల బెయిల్‌ ఔట్‌ ప్యాకేజీని విడుదల చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా వెల్లడైంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని కైరానా లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఓటమితో రైతుల ఆగ్రహాన్ని చవిచూసింది. ఆ జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న చెరుకు రైతుల వల్లే ఆ పార్టీ ఘోర ఓటమిని ఎదుర్కొవాల్సి వచ్చిందన్న విషయం స్పష్టమైంది. దీంతో చెరుకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం .. బెయిల్‌ ఔట్‌ ప్యాకేజీని విడుదల చేసేందుకు సిద్దమైంది. దీనిపై కేంద్ర క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. ఒక్క యూపీ రాష్ట్రంలోనే దాదాపు 22వేల కోట్ల మేరకు చెరుకు రైతులకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. బెయిల్‌ఔట్‌ ప్యాకేజీ ద్వారా సుమారు 30 మెట్రిక్‌ టన్నుల బఫర్‌ స్టాక్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కనీస మద్దత ధరను కూడా రూ.20కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నది. చెరుకు నుంచి ఉత్పత్తి అయ్యే ఎథనాల్‌ కోసం ప్యాకేజీల్లోనే 4వేల కోట్లను ప్రత్యేకంగా కేటాయించనున్నారు. ఇటీవల చెక్కర ధర విపరీతంగా తగ్గిపోవడంతో.. షుగర్‌ మిల్లులు రైతులకు కనీస ధరను కూడా ఇవ్వలేకపోయాయి.