చెరువుల పునరుద్ధరణ ప్రతిష్టాత్మకం.. మంత్రి హరీష్‌

5

హైదరాబాద్‌,ఫిబ్రవరి2(జనంసాక్షి): దేశంలో అత్యధిక చెరువులున్న రాష్ట్రం తెలంగాణనే అని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. చెరువుల పునరుద్దరణ కార్యక్రమం ఇప్పుడు ఇక ఉద్యమంగా సాగనుందని అన్నారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో వ్యవసాయాభివృద్ధి, మిషన్‌ కాకతీయపై నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రులు హరీష్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. మిషన్‌ కాకతీయను సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలోని చెరువులన్నీ వెయ్యేళ్ల క్రితం తవ్వినవి అని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో చెరువులను పట్టించుకోలేదని చెప్పారు. అందుకే తెలంగాణ ఏర్పడ్డ తరవాత పెద్ద ఎత్తున చెరువుల పునరుద్దరణతో పూర్వ వైభవం తేవాలని చూస్తున్నామని అన్నారు. తెలంగాణ రైతులను ఆదుకోవాలనే మిషన్‌ కాకతీయ చేపట్టామని పేర్కొన్నారు. దశల వారీగా చెరువులను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. మూడు వేల చెరువుల పునరుద్ధరణకు అన్ని చర్యలు పూర్తి అయ్యాయని వెల్లడించారు. మిగతా చెరువు పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ప్రకటించారు. చెరువుల్లోని పూడిక మట్టిని పంట పొలాల్లో వేసుకోవాలని సూచించారు. పూడిక మట్టితో రైతులకు చాలా లాభాలు ఉన్నాయన్నారు. దీంతో ఎరువుల వాడకం కూడా తగ్గిపోతుందని తెలిపారు.