చెరువుల మట్టిని వాడుకోండి
వరంగల్,ఏప్రిల్5(జనంసాక్షి): జిల్లాలో దాదాపు అన్ని చెరువుల మట్టినాణ్యత పరీక్షలు నిర్వహించగా వీటిలో అన్ని చెరువుల మట్టి పంట పొలాల్లో వేసుకునేందుకు అనుకూలంగా ఉందని అధికారులు తెలిపారు.జిల్లాలో రెండో విడత చేపట్టిన మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ పనుల్లో భాగంగా చేపట్టిన 17 చెరువుల మట్టి నాణ్యత పరీక్షల ఫలితాలను భూసార పరీక్ష కేంద్రం అధికారులు వెల్లడించారు. పంట పొలాల్లో రైతులు మట్టి వేసుకునేందుకు అనుకూలంగా ఉన్న చెరువులు నెక్కొండ మండలంలోని వెంకటాపూర్‌లోని పులికుంట, దీక్షకుంటలోని పెద్ద దామెరచెరువు, తోపనపల్లిలోని వూరచెరువు, బొల్లికుంటలోని దేవునికుంట, ముదిగొండలోని అప్పజగ్గయ్యకుంట, గొడ్లకొండలోని వూరచెరువు, నెక్కొండలోని ఐరచెరువు, రెడ్లవాడలోని మల్లారెడ్డికుంట, నాగారంలోని రమకుంట, ముదిగొండలోని గిద్దెకుంట చెరువుల మట్టిని పంటపొలాల్లో వేసుకునేందుకు అనుకూలంగా ఉందని ఏడీ తెలిపారు. నెక్కొండ మండలంలోని పెద్దకొర్పుల్ గ్రామంలోని వూరచెరువు, మడిపల్లిలోని లింగన్నకుంట, అలంకానిపేటలోని నల్లకుంట, పత్తిపాకలోని పుల్లయ్యకుంట, నాగారంలోని పెద్దచెరువు, చిన్నకొర్పుల్‌లోని పెద్దచెరువు, అప్పలరావుపేట గ్రామంలోని సీతమ్మగండి చెరువుల మట్టి ని పంటపొలాల్లో వేసుకునేందుకు అనుకూలంగా ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైందని తెలిపారు. ఈ చెరువుల మట్టిని రైతులు తోడ్కొని పోవాలన్నారు. దీంతో పొలాలు సారవంత కాగలవని అన్నారు.