చెలరెగిన చెన్నై
రాణించినా రైనా, ధోని
కుప్పకూలిన పూణే
టాప్ ప్లేస్‌లో చెన్నై
పుణె, ఏప్రిల్ 30 (జనంసాక్షి) :
పుణెలో మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పుణె వారియర్స్‌పై చెన్నై సూపర్‌కింగ్స్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ హస్సీ 8 బంతులు ఆడి 5 పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోయాడు. సాహ 15 బంతుల్లో 13 పరుగులు చేసి శర్మ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రైనా 50 బంతులు ఆడి 63 (5 ఫోర్లు, సిక్స్) చేసి నాటౌట్‌గా మిగిలాడు. బద్రీనాథ్ 31 బంతుల్లో 34 పరుగులు చేసి రైట్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ధోని వచ్చీరావడంతోనే రెచ్చిపోయాడు. 16 బంతుల్లో 45 (4 ఫోర్లు, 3 సిక్స్‌లు) పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. పుణె జట్టులో రోహిత్ శర్మ, రిచర్డ్సన్, రైట్ ఒక్కో వికెట్ తీశారు. 165 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పుణె జట్టు 127 పరుగులకే కుప్ప కూలింది. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ ఉతప్ప 11 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి రనౌటయ్యాడు. ఫించ్ 9 బంతుల్లో 15 పరుగులు చేసి రోహిత్ శర్మ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన సుమన్ ఎలాంటి పరుగులు చేయకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. యువరాజ్‌సింగ్ 5, స్మిత్ 35, రైట్ 2, నాయర్ 2, రిచర్డ్సన్ 26, కుమార్ 24 (నాటౌట్), దిండా 2 పరుగులు చేయగా రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. ఇంకా 37 పరుగులు చేయాల్సి ఉండగా చేతులెత్తేశారు. చెన్నై జట్టులో శర్మ 3, జడేజా, మొర్రీస్, బ్రావో ఒక్కో వికెట్ తీశారు.