చైన్ స్నాచర్లపై పోలీసుల కాల్పులు
హైదరాబాద్: చైన్ స్నాచర్లపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాలను పోలీసులు అమలుపరుస్తున్నారు. సంచలన రీతిలో స్నాచింగ్ కు పాల్పడిన దుండగులపై కాల్పులు జరిపారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వనస్థలిపురం ఆటోనగర్ రాజధాని హోటల్ వద్ద సోమవారం ఉదయం ఈ సంఘటన జరిగింది.
బైక్ పై దూసుకొచ్చిన దుండగులు.. ఒక మహిళ మెడలో బంగారు గొలుసు లాగేందుకు విఫల యత్నం చేసి పారిపోతుండగా యాంటీ స్నాచింగ్ టీమ్ సిబ్బంది వారిని వెంబడించారు. వాహనం ఆపమని హెచ్చరించినప్పటికీ దుండగులు వినిపించుకోలేదు. దీంతో పోలీసులు రివాల్వర్ తీసి దుండగులపై కాల్పులు జరిపారు. చివరికి దుండగులు గాయపడకుండా తప్పించుకోగలిగారు. పారిపోయిన వారి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
కాల్పులు చోటుచేసుకున్న ప్రాంతంలో జనసమ్మర్థం అధికంగా ఉంటుంది. తుపాకి చప్పుడుతో అక్కడివారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.