చోటు ఎవరికో… వేటు ఎవరికో…!

ఛాంపియన్స్‌ ట్రోఫీకి రేపు భారత జట్టు ఎంపిక

ముంబై ,మే 3 (జనంసాక్షి):

వచ్చే నెలలో జరగనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం రేపు భారత జట్టును ఎంపిక చేయనున్నారు. దీని కోసం సందీప్‌పాటిల్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ముంబైలో సమావేశం కానుంది. ఇప్పటికే ప్రకటించిన 30 మంది ప్రాబబుల్స్‌ జాబితాలో 15 మందిని ఎంపిక చేయనున్నారు. ప్రాబబుల్స్‌లో చోటు దక్కని వీరేంద్ర సెహ్వాగ్‌, హర్భజన్‌సింగ్‌లను సెలక్టర్లు ఎంపిక చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్‌ ఆరో సీజన్‌లో వీరిద్దరి ఆటతీరును సెలక్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఐసిసి నిబంధనల ప్రకారం ప్రాబబుల్స్‌లో లేని పేర్లను కూడా సెలక్టర్లు ఎంపిక చేయొచ్చు. ఇదిలా ఉంటే ఓపెనర్ల రేసులో నలుగురు పోటీలో ఉండడంతో సెహ్వాగ్‌కు చోటు దక్కడం డౌటేనని భావిస్తున్నారు. మురళీ విజయ్‌, శిఖర్‌ ధావన్‌, గౌతం గంభీర్‌, ఉన్ముక్త్‌ చాంద్‌లకే మొదటి ప్రాధాన్యత లభించే అవకాశాలున్నాయి. అటు నలుగురు స్పిన్నర్ల స్థానాల కోసం అశ్విన్‌, అమిత్‌మిశ్రా, రవీంద్ర జడేజా, జలజ్‌ సక్సేనా, పర్వేజ్‌ రసూల్‌ రేసులో ఉన్నారు. అయితే హర్భజన్‌ మాత్రం రేసులో వెనుకబడినట్టు బోర్డు వర్గాల సమాచారం. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కోసం ఏడుగురు ఆటగాళ్ళు పోటీలో ఉన్నారు. అలాగే నలుగురు వికెట్‌ కీపర్లు కూడా సెలక్టర్ల దృష్టిలో ఉన్నట్టు తెలుస్తోంది. పేస్‌ విభాగంలో 10 మంది బౌలర్లు జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. కాగా పది మంది పేర్లు ఇప్పటికే ఖరారైనట్టు , ఐదు స్థానాల కోసమే సెలక్టర్లు చర్చించాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఐపీఎల్‌ ఆరోసీజన్‌లో పలువురు యువ ఆటగాళ్ళు అద్భుతంగా రాణిస్తూ సెలక్టర్లకు జట్టు ఎంపికను మరింత క్లిష్టం చేశారు. దీంతో సెలక్టర్లు పెద్ద కసరత్తే చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో గ్రూప్‌ బిలో చోటు దక్కించుకున్న భారత్‌ తన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది.