జగదీశ్వర్‌రెడ్డికు ముడుపులు అందాయి
సర్కారు విచారణకు సిద్ధమైతే ఆధారాలు అందిస్తా…పొన్నం ప్రభాకర్
హైదరాబాద్,ఫిబ్రవరి21(జనంసాక్షి): తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా గతంలో పనిచేసిన జగదీశ్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన శాఖను మార్చారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు. రెండు దఫాలుగా కాలేజీలకు విడుదల చేసిన రూ. 1,360 కోట్ల ఫీజు రీయింబర్స్మెంటు నిధుల్లో మంత్రి జగదీశ్ రెడ్డి, టీఆర్‌ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి 5 శాతం చొప్పున కవిూషన్లు తీసుకున్నారని తీవ్రంగా ఆరోపించారు. ఈ విషయం సిఎంకు తెలుసని అన్నారు. అందుకే శాఖ మార్చి వ్యవహారం పొక్కకుండా చూసుకున్నారని అన్నారు. దీనిపై విచారణకు ఆదేశిస్తే.. ఈ వ్యవహారంలో జరిగిన మొత్తం అవినీతిని తాము నిరూపిస్తామని పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్ తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ నుంచి సంపాదించిన నిధులతో కోళ్లఫారాలలో ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేశారని, అలాంటి 200 ఇంజనీరింగ్ కళాశాలలను కేసీఆర్ రద్దు చేశారని చెప్పారు. అయితే.. కేవలం కాలేజీల రద్దుతోనే సరిపెట్టేసిన సర్కారు.. వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులపై
ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పీజురియింబర్స్‌మెంట్‌లో ప్రభుత్వానికి ముడుపులు అందాయని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఇంజినీరింగ్ కాలేజీలకు రూ. 500 కోట్లు విడుదల చేయడంతోనే.. ప్రభుత్వానికి ముడుపులు ముట్టాయని తెలుస్తోందన్నారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ ఇంజనీరింగ్ కాలేజీల నుంచి మంత్రి జగదీశ్ రెడ్డి 5 శాతం కమిషన్ తీసుకున్నారని, ఇందులో టీఆర్‌ఎస్ నేత పల్ల రాజేశ్వర్ రెడ్డి కూడా భాగస్వామ్యం ఉందని ఆయన ఆరోపణలు గుప్పించారు. నందగిరి హిల్స్‌లోని ఓ గెస్ట్‌హౌస్‌లో దీనిపై చర్చలు జరిగాయన్నారు. ఇందుకు సంబంధించి తమ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని పొన్నం తెలిపారు. దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడిన జగదీశ్ రెడ్డి, పల్ల రాజేశ్వర్ రెడ్డిలను పదవుల నుంచి తప్పించాలని పొన్నం డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ భోగస్ అన్న కేసీఆర్.. ఈ నిధులను ఎందుకు విడుదల చేశారని ఆయన ప్రశ్నించారు.