జగన్ కేసులో ఏ4 సబిత
ఐదో చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ
రాజీనామాకు సిద్ధమైన హోం మంత్రి
కిరణ్ సర్కారులో కలకలం ముగ్గురు మంత్రులపై చార్జిషీట్లు..
ఒకరు ఔట్.. మరో ఐదు మంది డౌట్!?
హైదరాబాద్, ఏప్రిల్ 7 (జనంసాక్షి) :
జగన్ అక్రమాస్తుల కేసుల కేసులో పాపాల పుట్ట పగులుతోంది. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారికి అనుచిత లబ్ధి కలిగించేలా వ్యవహరించిన అప్పటి గనుల శాఖ, ప్రస్తుత హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఐదో చార్జిషీట్‌లో ఏ4గా సీబీఐ పేర్కొంది. ఇప్పటికే జగన్ కేసు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తోండగా తాజాగా సబితను ఏ4గా పేర్కొనడంతో మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందని మిగతా మంత్రులు ఆందోళన చెందుతున్నారు. జగన్ ఆస్తుల కేసుకు మూలమైన 26 జీవోల జారీలో ఆరుగురు మంత్రుల ప్రమేయ మున్నట్లుగా సుప్రీం కోర్టు జోక్యం వెల్లడైంది. సుప్రీం ఆదేశాల మేరకు వారిపై సీబీఐ దార్యాప్తు చేస్తోంది. వీరిలో మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే అరెస్టు అయి చంచల్‌గూడ జైల్లో ఉండగా, వాన్‌పిక్ కేసులో ధర్మానను నాలుగో చార్జిషీట్‌లో ఏ5గా సీబీఐ పేర్కొంది. తాజాగా సబితను నిందితురాలిగా చేర్చడంతో, ఆరోపణలు ఎదుర్కొం టున్న మిగతా మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య బోనెక్కడం ఎంతో దూరంలో లేదనే వాదనలు వినవస్తున్నాయి. సీబీఐ తాజా చార్జిషీటు కిరణ్ సర్కారుకు సంకటంగా మారింది. వాన్‌పిక్ కేసులో సీబీఐ అభియోగాలు నమోదు చేసిన వెంటనే ధర్మాన ప్రసాదరావు తన పదవికి రాజీనామా చేయగా దీర్ఘకాలం పెండింగ్‌లో పెట్టిన సీఎం కిరణ్ కొద్ది రోజుల క్రితమే దానిని తిరస్కరించారు. మంత్రివర్గం మొత్తం ఆయనకు బాసటగా నిలిచింది. సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన కొద్దిసేపటికే తాను రాజీనామా చేస్తానని సబిత సీఎం కిరణ్‌కు చెప్పగా ఆయన వారించారు. ఇప్పటికే మోపిదేవి జైల్లో ఉండగా మిగతా ఐదుగురు మంత్రుల పరిస్థితి ఏమిటి? కథ వారితోనే ముగుస్తుందా? అప్పటి మంత్రివర్గం మొత్తం బాధ్యత వహించాల్సి వస్తే పరిస్థితి ఏమిటీ? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి సిబిఐ సోమవారం నాంపల్లిలోని సీబీఐ కోర్టులో 5వ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌లో 13మంది నిందితుల పేర్లు చేర్చింది. 62 పేజీలతో 53 అనుబంధ డాక్యుమెంట్లతో 47మంది సాక్ష్యులతో కూడిన చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. ప్రస్తుత హోంమంత్రి, వైఎస్ హయాంలో గనుల శాఖమంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి పేరుతో పాటు అప్పటి గనుల శాఖ ఎండీ రాజగొపాల్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పేర్లను కూడా నిందితులుగా చేర్చింది. నమ్మకద్రోహం, కుట్ర, అవినీతి ఆరోపణలకు సంబంధించిన సెక్షన్లను వారిపై మోపింది. అలాగే జగన్ కంపెనీలలోకి పెట్టుబడులు పెట్టిన పలు సిమెంట్ కంపెనీల యజమానులు, కీలక ఉద్యోగుల పేర్లను కూడా చార్జిషీట్‌లో పేర్కొంది. ఇప్పటివరకు జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి ముగ్గురు మంత్రులపై చార్జిషీట్ దాఖలైంది. హోంమంత్రి సబితపై ఐపిసి సెక్షన్లు 120బి, రెడ్ విత్ 420, 409, 420కింద అభియోగాలు నమోదు చేసింది. అలాగే అవినీతి నిరోధక చట్టంలోని 9,12,13, 13(1) సెక్షన్ల కింద కూడా ఆమెపై కేసులను నమోదు చేసింది. కాగా, సబిత ప్రాసిక్యూషన్‌కు అనుమతి అవసరం లేదని సిబిఐ పేర్కొంది. సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిశీలించిన తరువాత నాయస్థానం నిందితులపై సమన్లు జారీ చేసే అవకాశం ఉంది.
నిందితుల వివరాలు :
ఏ1 జగన్, ఏ2 విజయసాయిరెడ్డి, ఏ3 దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియా, ఏ4 సబితా ఇంద్రారెడ్డి, ఏ5 పరిశ్రమల శాఖ మాజీ కార్యదర్శి శ్రీలక్ష్మి, ఏ6 గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్, ఏ7 ఈశ్వర్ సిమెంట్స్ ఎండీ సజ్జల దివాకర్‌రెడ్డి, ఏ8 దాల్మియా సిమెంట్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ ఎస్.మిశ్రా, ఏ9 దాల్మియా సీనియర్ మేనేజర్ నీల్ కుమార్ ధమల్ బేరి, ఏ10 దాల్మియా మేనేజర్ జైదీప్ బసు, ఏ11 రఘురాం సిమెంట్స్, ఏ12 దిల్మియా సిమెంట్స్, ఏ13 ఈశ్వర్ సిమెంట్స్.