జగన్‌, పవన్‌లతో కలిసే బీజేపీ డ్రామా

– మోడీ చెప్పినట్లే వారిరువురు నడుచుకుంటున్నారు

– చంద్రబాబును రాజీనామా చేయమనే హక్కు పవన్‌కు లేదు

– కేంద్రంతో పోరాడుతున్నది తెదేపా ఒక్కటే

– పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ వెళ్లి ప్రధాని ఇంటిముందు తొడగొట్టాలి

– ప్రతి సంక్షేమ పథకం చంద్రబాబు కష్టార్జితమే

– ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న

విజయవాడ, జులై7(జ‌నం సాక్షి) : కేంద్రం ఆడిస్తున్నట్లు జగన్‌, పవన్‌ ఆడుతున్నారని, పవన్‌ రాజకీయం కూడా బీజేపీ డైరెక్షన్‌ లో నడుస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆరోపించారు. శనివారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గవర్నర్‌ ని కలిసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని బీజేపీ డిమాండ్‌ చేయడం, నాలుగు రోజుల తర్వాత పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబుని రాజీనామా చేయాలనడం ఇదంతా కూడా రహస్య ఒప్పందాల్లో భాగమేనని ఆయన అన్నారు. అధిష్టానం మోడీ చెప్పినట్లు పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్నారని వివరించారు. చంద్రబాబు నాయుడు ఎవరి దయా దాక్షిణ్యాలవిూద సీఎం కాలేదని, సీఎంని రాజీనామా చేయాలనే అర్హత విూకెక్కడిది అని ప్రశ్నించారు. పవన్‌ రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బుద్ద ఆరోపించారు. రైల్వే జోన్‌ కీ సీఎం రాజీనామాకీ సంబంధం ఏమిటని ప్రశ్నించారు. విభజన హావిూలను సాధించేందుకు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నది చంద్రబాబు మాత్రమేనని ఆయన విరుచుకు పడ్డారు. పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ వెళ్లి ప్రధాని ఇంటిముందుకెళ్లి అక్కడ తొడగొట్టి డిమాండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అంతేతప్ప ఇక్కడ రాష్ట్రప్రయోజనాలకోసం పోరాడుతున్న చంద్రబాబుని రాజీనామా చేయమనడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనను చూసే మోడీ గుజరాత్‌ లో చంద్రబాబు విధానాలను అనుసరించారని.. దేశాన్ని పాలించడం మోడీకి చేతకావడం లేదని బుద్ద వెంకన్న ఎద్దేవా చేశారు. అవసరమైతే మోడీకి చంద్రబాబు దగ్గర ఒక గంట క్లాస్‌ చెప్పించుకోండంటూ బీజేపీ నేతలకు సూంచారు. అంతేకాకుండా సోము వీర్రాజువి కాకి లెక్కలు అంటూ కొట్టిపారేశారు. కొంతమంది నేతలు మోడీకి తొత్తులుగా మారి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతిస్తున్నారని, రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరగలేదని బుద్దా స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి సంక్షేమ పథకం చంద్రబాబు కష్టార్జితమేనని.. కేందప్రభుత్వం సొమ్ము ఎవడబ్బ సొమ్ము కాదని.. ప్రజలు కట్టే పన్నులేనని బుద్దా వెంకన్న వివరించారు. ఇప్పటికైన బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలని లేకుంటే ప్రజలు తరిమికొడతారని బుద్ద వెంకన్న హెచ్చరించారు.