జగన్‌, విజయసాయిలకు నార్కో పరీక్షలకు కోర్టు నిరాకరణ

హైదరాబాద్‌, జూలై 16 (జనంసాక్షి): వైఎస్‌ జగన్‌, విజయసాయిరెడ్డిలను నార్కో పరీక్షకు అనుమతి ఇవ్వాలని సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సిబిఐ కోర్టు సోమ వారంనాడు తిరస్కరించింది. జగన్‌, విజయసాయిలకు నార్కో పరీక్షలు అవసరం లేదని చెప్పింది. ఇదిలా ఉండగా అయిదు రోజుల కస్టడీలో జగన్‌ పెదవి విప్పలేదని, జగన్‌ ఆస్తుల కేసులో జగన్‌, విజయసాయి కుట్రదారులని, వారి చేత నిజం చెప్పించేందుకు నార్కో పరీక్షకు అనుమతి ఇవ్వాలని సిబిఐ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిందితుల అనుమతి లేనిదే నార్కో పరీక్ష నిర్వహించరాదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పరిశీలించాని జగన్‌ తరపు న్యాయవాది వాదించిన విషయం విదితమే. ఇరువురి వాదనలు విన్న నాంపల్లి సిబిఐ కోర్టు తన తీర్పును సోమవారంనాడు వెలువరించింది. నార్కో పరీక్షలు అవసరం లేదని స్పష్టం చేసింది.
సిబిఐ కోర్టులో జగన్‌ పిటిషన్‌
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని వైఎస్‌ జగన్‌ నాంపల్లి సిబిఐ కోర్టులో సోమవారంనాడు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నెల 19న జరిగే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ రోజున ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని జగన్‌ తన పిటిషన్‌లో కోర్టును కోరారు.