జగన్‌, సబిత కోర్టుకు హాజరు

ధర్మాన, సబితను కస్టడీకి ఇవ్వండి
కోర్టులో సీబీఐ మెమో
హైదరాబాద్‌, జూన్‌ 7 (జనంసాక్షి) :
జగన్‌ అక్రమాస్తుల కేసులో శుక్రవారం జగన్‌, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోర్టుకు హాజరయ్యారు. దాల్మియా వ్యవహారంపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ విచారణను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది. చార్జిషీట్‌లో నిందితులుగా ఉన్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఆడిటర్‌ విజయసాయిరెడ్డిలకు న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. మిగతా నిందితులంతా రెండు ష్యూరిటీలు, రూ.25 వేల పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. దీంతో కొంత మంది ష్యూరిటీలు సమర్పించగా, మిగిలిన వారికి 21 వరకు గడువు విధించింది. దాల్మియా వ్యవహారంపై దర్యాప్తు సంస్థ ఏప్రిల్‌ 8న దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం నిందితులందరినీ కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. దీంతో జగన్‌, విజయసాయి, పునీత్‌ దాల్మియా ప్రతినిధులు, సబితాఇంద్రారెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్‌, ఈశ్వర్‌ సిమెంట్స్‌ ఎండీ సజ్జల దివాకర్‌రెడ్డి, సంజయ్‌ ఎస్‌.మిత్ర, నీల్‌ కమల్‌ బేరి, రఘురామ్‌, దాల్మియా సిమెంట్స్‌ ప్రతినిధులు హాజరయ్యారు. రిమాండ్‌లో ఉన్న జగన్‌, విజయసాయిలను కట్టుదిట్టమైన భద్రత నడుమ కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా సీబీఐ చార్జిషీట్‌ ప్రతులను నిందితులందరికీ అందజేసింది. ¬ం శాఖ మాజీ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి కోర్టుకు హాజరు కావడం ఇదే తొలిసారి. అనారోగ్యం కారణంగా శ్రీలక్ష్మిని అంబులెన్స్‌లో తీసుకువచ్చారు. ఇదిలా ఉంటే, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డికి కస్టడీ విధించాలని సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేసింది. దర్యాప్తును ప్రభావితం చేసేలా మాట్లాడారని, వారు బయట ఉంటే సాక్ష్యాధారాలు ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు విూడియా మాట్లాడిన సీడీని కోర్టుకు సమర్పించింది.
ఉత్సాహంగా జగన్‌
దాదాపు ఆర్నెల్ల అనంతరం జగన్‌ చంచల్‌గూడ జైలు నుంచి బయటకు వచ్చారు. దాల్మియా చార్జిషీట్‌పై విచారణ సందర్భంగా జగన్‌ను వ్యక్తిగతంగా హాజరు పరచాలని కోర్టు ఆదేశించడంతో సీబీఐ అధికారులు ఆయనను కట్టుదిట్టమైన భద్రత నడుమ న్యాయస్థానంలో హాజరు పరిచారు. జైలు నుంచి బయటకు వచ్చిన జగన్‌.. అభిమానులకు, విూడియాకు అభివాదం చేశారు. తొలిసారి హాఫ్‌ హ్యాండ్స్‌ షర్ట్‌ ధరించి కనిపించారు. లేత గులాబీ రంగు షర్ట్‌, క్యాజువల్‌ ప్యాంట్‌ ధరించిన జగన్‌ చాలా ఉత్సాహంగా కనిపించారు. చంచల్‌గూడ జైలు నుంచి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో భారీ భద్రతతో సీబీఐ కోర్టుకు తరలించారు. జగన్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. జైలు వద్ద, కోర్టు వద్ద జగన్‌ అభిమానులు కాన్వాయ్‌ను అడ్డుకొనేందుకు యత్నించగా, పోలీసులు వారిని నెట్టివేశారు.
సబితను పలకరించిన జగన్‌
కోర్టుకు వచ్చిన జగన్‌.. అప్పటికే అక్కడకు చేరుకున్న సబితను చూసి నవ్వుతూ పలకరించారు. బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేశారు. తొలుత స్పందించని సబిత.. ఆ తర్వాత జగన్‌ను పలకరించారు. బాగున్నానని చెబుతూనే.. మీరెలా ఉన్నారని ప్రశ్నించారు. బాగున్నానని బదులిచ్చిన జగన్‌ అక్కడే ఉన్న అభిమానులను, మీడియా ప్రతినిధులను కూడా పలకరించారు. కోర్టు వద్ద జగన్‌ను కలిసిన విజయమ్మ ఆయనను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. విజయమ్మ కంటతడి పెట్టడంతో జగన్‌తో పాటు శోభానాగిరెడ్డి, సబితాఇంద్రారెడ్డి తదితరులు ఆమెను ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని జగన్‌ విజయమ్మకు సూచించారు.
కిక్కిరిసిన కోర్టు హాల్‌
జగన్‌ రాకతో ఆయన అభిమానులు, న్యాయవాదులు, పోలీసులతో కోర్టు హాల్‌ కిక్కిరిసిపోయింది. దీంతో కోర్టు హాల్‌లో కాసేపు గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో విచారణ పది నిమిషాలు వాయిదా పడింది. న్యాయమూర్తి యూ.దుర్గాప్రసాదరావు కేసుకు సంబంధించిన నిందితులు, న్యాయవాదులు మినహా మిగతా వారంతా హాల్‌ నుంచి బయటకు వెళ్లాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కొంత మంది న్యాయవాదులు న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. పది నిమిషాల వాయిదా అనంతరం విచారణ ప్రారంభమైంది. నిందితులను ఒక్కొక్కరిగా కోర్టులోకి పిలిచి వారి హాజరును నమోదు చేసుకున్న న్యాయమూర్తి.. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ ప్రతులను అందజేశారు. రిమాండ్‌లో ఉన్న జగన్‌, విజయసాయిలకు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు. మిగతా నిందితులంతా వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించారు. దీంతో నిందితులంతా పూచీకత్తులు సమర్పించారు.
కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతి
తన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతించాలని జగన్‌ తరఫు న్యాయవాది కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో గంట సేపు మాట్లాడేందుకు న్యాయమూర్తి దుర్గాప్రసాదరావు అనుమతించారు. దీంతో జగన్‌ తల్లి విజయమ్మ, భార్య భారతి, మేనత్త, ఇతర కుటుంబ సభ్యులతో పాటు శోభానాగిరెడ్డి తదితరులతోనూ మాట్లాడారు. కుశల ప్రశ్నలు వేస్తూ అందరినీ పలకరించారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. వారితో మాట్లాడిన అనంతరం జగన్‌ను తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. కోర్టు నుంచి బయటకు తీసుకువస్తుండగా కొందరు అభిమానులు జైజగన్‌ అంటూ కాన్వాయ్‌ను అడ్డుకొనేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని నెట్టివేసి కాన్వాయ్‌ను ముందుకు తీసుకెళ్లారు.
ముభావంగా సబిత
మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. దాల్మియా చార్జిషీట్‌లో నాలుగో నిందితురాలిగా ఉన్న ఆమెను కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం గత నెల 14న సమన్లు జారీ చేసింది. దీంతో సబిత శుక్రవారం కోర్టుకు వచ్చారు. అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఉన్న తనకు కస్టడీ విధించాలని సీబీఐ మెమో దాఖలు చేయడంపై ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఏప్రిల్‌ 8న సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకన్న కోర్టు.. జూన్‌ 7న కోర్టుకు రావాలని కోరడంతో సబిత హాజరయ్యారు. ఆమె హాజరు నమోదు చేసుకున్న న్యాయస్థానం.. చార్జిషీట్‌ ప్రతులను అందజేసింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేయడంతో ఆమె ఇంటికి వెళ్లిపోయారు. కోర్టుకు హాజరైనప్పటి నుంచీ వెళ్లిపోయే వరకూ సబిత ముభావంగానే కనిపించారు. విూడియాతో సహా ఎవరితో మాట్లాడలేదు. జగన్‌ ఆస్తుల కేసులో రాజీనామా చేసిన మూడో మంత్రి సబిత.
అంబులెన్స్‌లో వచ్చిన శ్రీలక్ష్మి
చంచల్‌గూడ జైలులో ఉన్న శ్రీలక్ష్మి అంబులెన్స్‌లో కోర్టుకు హాజరయ్యారు. అయితే, మూడో అంతస్తులో ఉన్న కోర్టు హాల్‌కు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆమె తరఫు న్యాయవాది మెమో దాఖలు చేశారు. అనారోగ్యం కారణంగా ఆమె కోర్టు హాల్‌కు వచ్చే పరిస్తితి లేదని వివరించారు. దీంతో కోర్టు సిబ్బంది అంబులెన్స్‌ వద్దకు వచ్చి ఆమె హాజరును నమోదు చేసుకొని, చార్జిషీట్‌ ప్రతులను సమర్పించారు.
జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితులుగా ధర్మాన, సబితలకు జ్యూడీషియల్‌ కస్టడీ విధించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కోరింది. ఈ మేరకు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో శుక్రవారం మెమో దాఖలు చేసింది. దాల్మియా చార్జిషీట్‌లో నాలుగో నిందితురాలిగా సబిత, మరో చార్జిషీట్‌లో ధర్మాన ఐదో నిందితుడిగా ఉన్నారు. ఈ ఇద్దరు నిందితులు బయట ఉంటే కేసులోని కీలక సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని, సాక్షులను బయటపెట్టవచ్చని తెలిపింది. తమ వ్యాఖ్యలతో దర్యాప్తును, సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశముందని పేర్కొంది. తాము కేసు నుంచి నిర్దోషులుగా బయటపడతామన్న సబితాఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలను సీబీఐ తీవ్రంగా తప్పుబట్టింది. ఇటీవల మంత్రి పదవులకు రాజీనామా చేసిన సమయంలో వారిద్దరూ మాట్లాడుతూ.. తాము నిర్దోషులమని, కేసు నుంచి బయటపడతామని వ్యాఖ్యానించారు. తామెలాంటి తప్పూ చేయలేదని, అక్రమాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలు సీబీఐని కించపరిచేలా ఉన్నాయని.. కేసు దర్యాప్తులో ఉండగానే కేసు నుంచి నిర్దోషులుగా బయటపడతామని ఎలా చెబుతారని సీబీఐ న్యాయవాది ప్రశ్నించారు. ఈ మేరకు ధర్మాన, సబిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సీడీని కోర్టుకు సమర్పించారు. ఈ వ్యాఖ్యలే వారు సాక్ష్యాలను తారుమారు చేస్తారనడానికి, సాక్షులను బెదిరిస్తారనడానికి నిదర్శనమని న్యాయమూర్తికి తెలిపారు. వారు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కేసు నుంచి బయటపడతామని సబిత, ధర్మాన విూడియాతో మాట్లాడడం దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తోందని పేర్కొన్నారు. జగన్‌ కేసులో సీబీఐ తెలివిగా వ్యవహరిస్తోంది. ధర్మాన, సబితలకు కస్టడీ విధించాలని పిటిషన్‌ దాఖలు చేయకుండా, మెమో దాఖలు చేయడమే అందుకు నిదర్శనం. పిటిషన్‌ దాఖలు చేస్తే.. నిందితుల తరఫు వాదనలు వినాల్సి ఉండడం తదితర పరిణామాలకు అవకాశాలు ఉంటాయి. అదే మెమో దాఖలు చేస్తే.. నిందితుల వాదనలు వినాల్సిన అవసరం లేకుండా న్యాయస్థానామే నిర్ణయం తీసుకుంటుంది. అందుకే సీబీఐ వారిద్దరికి కస్టడీ విధించాలని కోర్టులో మెమో దాఖలు చేసింది. ఈ మెమోను స్వీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే, జగన్‌ కేసులపై వాదించేందుకు ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా సీబీఐ సురేంద్రను నియమించింది. ఇప్పటివరకు సత్యం కుంభకోణం కేసులో సీబీఐ తరఫున ఆయన వాదిస్తున్నారు.