జడ్చర్ల సభతో కాంగ్రెస్‌ కూటమికి బైర్లు కమ్మాయి

పాలమూరును పచ్చగ చేయడమే మా లక్ష్యం

తెలంగాణ అభివృద్ది కెసిఆర్‌ నినాదం

మహాకూటమిని నమ్మి మోసపోవద్దు: మంత్రి లక్ష్మారెడ్డి

మహబూబ్‌నగర్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీకి, మహాకూటమికి పొరపాటున ఓటు వేసినా మన

అభివృద్ధిని మనమే అడ్డుకున్న వారమవుతామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డా.సీ.లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల సభతో విపక్షాలకు బైర్లు కమ్మాయని అన్నారు. కెసిఆర్‌ అంటే ప్రజల్లో విపరీతమైన అభిమానం ఉందని మరోమారు రుజువు అయ్యిందన్నారు. ప్రజలు అనూహ్యంగా తండోపతండాలుగా తరలి వచ్చారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తెలంగాణలోని ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని.. అలాంటి దొంగలు గ్రామాల్లోకి ఓట్ల కోసం వచ్చినప్పుడు నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణను ఆగం పట్టించిన చంద్రబాబు మహాకూటమి పేరుతో మళ్లీ దొడ్డిదారిన అధికారం చెలాయించడానికి వస్తున్నాడని పేర్కొన్నారు. దొంగలకు సద్దికడితే మన బతుకులు ఆగమవుతాయని చెప్పారు .జడ్చర్ల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మల్లురవి ఓట్ల కోసం పూర్తిగా దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ను రద్దు చేయిస్తానని ఉదండాపూర్‌, వల్లూర్‌ గ్రామస్తులతో మల్లురవి మాట్లాడాడని అన్నారు. ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ను అడ్డుకునేందుకు ఆయన అడుగడుగునా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రైతుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు నిరంతరాయంగా 24గంటల క రెంటు ఇవ్వగడం జరుగుతుందన్నారు. వచ్చే మూడేళ్లలో ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ను పూర్తి చేసి నవాబ్‌పేట మండలంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని చెప్పారు. కారుగుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అభివృద్ధి చేశా మరోసారి ఆదరించి డిసెంబర్‌ 7న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని అన్నారు. 67 సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని కేసీఆర్‌ నాలుగున్నరేళ్లల్లో చేసి చూపించారని పేర్కొన్నారు. సర్వ జనులంతా సంతోషంగా ఉండేలా 462 సంక్షేమ పథకాలను అందించారన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌, రైతు బంధు పథకం ద్వారా పంట పెట్టుబడి, రైతు భీమా పథకాలను అందించి రైతన్నను దేశానికే రాజును చేశారని పేర్కొన్నారు. అభివృద్ధిని ఆకాంక్షించి కేసీఆర్‌ బాటలో నడస్తున్న నన్ను 2018 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గ అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేస్తానని పేర్కొన్నారు.