జనకోటి జాతర

3

– సమ్మక్క సారలమ్మలు వనప్రవేశం

వరంగల్‌, ఫిబ్రవరి 20(జనంసాక్షి): వరంగల్‌ జిల్లాలోని మేడారం మహా జాతరకు జన నీరాజనాల మధ్య శనివారం సమ్మక్క సారలమ్మల వన  ప్రవేశంతో ముగిసింది. గత  నాలుగు రోజుల పాటు లక్షలాది మంది భక్తుల రాకతో జనారణ్యంగా మారిన మేడారం జాతరకు మునుపెన్నడు లేని రీతిలో ప్రజలు తరలివచ్చారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని నిలువెత్తు బంగారం(బెల్లం)తో పాటు పసుపు, కుంకుమలతో, కానుకలతో మొక్కులు తీర్చుకొని సల్లంగా చూడు తల్లి…తిరిగి వస్తాము మళ్ళీ….అంటూ శనివారం వెనుదిరిగారు. భక్తుల కానుకలతో, బెల్లంతో జాతరలోని సమ్మక్క సారలమ్మ గద్దెలు, హుండీలు నిండిపోయాయి. ఈ సారి జాతరకు కోటి మందికి పైగా ప్రజలు తరలివచ్చినట్లు జిల్లా కలెక్టర్‌ వాకటి కరుణ కరుణ ప్రకటించారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా చత్తీస్‌గడ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒరిస్సాల నుంచి తరలివచ్చిన భక్తులతో జాతర ప్రాంతం చుట్టు ఐదు కిలోమీటర్ల మేర ప్రజలతో కిక్కిరిసిపోయింది. శనివారం సాయంత్రం జనదేవతల వన ప్రవేశం ఘనంగా ముగిసింది.  సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మలను కన్నెపల్లికి ప్రవేశం చేయించగా, పగిడిద్ద రాజును కొత్తగూడ మండలం పూనుగుండ్లకు, గోవిందరాజులును కొండాయికి తీసుకువెళ్ళారు. గిరిజన పూజారులు సాంప్రదాయబద్దంగా ఈ కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో గత కొన్ని రోజులుగా సాగిన మేడారం జాతర మహాఘట్టానికి తెరపడినట్లయ్యింది. అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకున్న లక్షలాది జనం వెనుదిరగడం ప్రారంభించారు. ఎంతో ఉత్కంఠతతో విధులు నిర్వహించిన జిల్లా యంత్రాంగం భక్తులు కొంత ఇబ్బందులను ఎదుర్కొన్నా జాతర ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్నది. ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతరకు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో జాతర నిర్వహణలో అధికారులు ఈ సారి కొంత సమన్వయ లోపాన్ని ఎదుర్కొన్నారు. జిల్లా కేంద్రం నుంచి మేడారం వరకు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడంలో, మేడారంలోని సమ్మక్క సారలమ్మల గద్దెలను భక్తులు దర్శించుకునేందుకు చేసిన ఏర్పాట్లలో జరిగిన లోపాల వల్లే లక్షలాది మంది భక్తులు ఇబ్బందుల పాలయ్యారు. జాతరకు ముందే గత అనుభవాల నేపధ్యంలో సీనియర్‌ అధికారులు, మీడియా ప్ర్రతినిధులు పమాదాన్ని ముందే హెచ్చరించినా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.గతంలో ఎన్నడూ లేని విధంగా వేల సంఖ్యలో విఐపి, వివిఐపి పాసులు, వాహనం పాసులు జారీ చేశారు. జాతరలో పకడ్బందీ ఏర్పాట్లు చేసి, సమ్మక్క సారలమ్మలను తీసుకువచ్చే సమయంలోనూ తొక్కిసలాట లేకుండా చూడటంతో పాటు క్యూలైన్లను విస్తరించడం, జంపన్న వాగు నుంచి గద్దెల వరకు రోడ్లు, అంతర్గత రోడ్ల నిర్మాణంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడటంలో కొంత సఫలీకృతమైనా  గద్దెల వద్ద దర్శనం కోసం నాలుగైదు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి రావడంతో భక్తులు ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తొక్కిసలాటకు గురి కాకుండా చూడగలిగారు.  జాతరలోని గద్దెల వద్ద భక్తులకు బెల్లం అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయకపోవడంతో దేవతల బంగారం (బెల్లం) కోసం భక్తులు పోటీ పడాల్సి వచ్చింది. ఈ క్రమంలో తోపులాటలు జరిగి పోలీసుల లాఠీచార్జీ ఘటనలు చోటు చేసుకున్నాయి.ఒక వైపు రెవెన్యూ, మరో వైపు పోలీసు యంత్రాంగం మధ్య సమన్వయం కొరవడటంతోనే ఈసారి భక్తులు ఇబ్బందులు పడ్డారు. తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోయింది. జాతర నాలుగు రోజుల పాటే జరిగినా కోట్లాది రూపాయల వ్యాపారానికి మేడారం కేంద్ర బిందువయ్యింది. ముఖ్యంగా అధిక సంఖ్యలో భక్తులు నిలువెత్తు బెల్లాన్ని సమర్పించేందుకు పోటీపడటంతో జాతరలో దాదాపు వేల టన్నుల బెల్లం వ్యాపారం జరిగి ఉంటుందని, ఇతర ఆటవస్తువులు, హోటళ్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాల రాకపోకలు, ఇతర వ్యాపారాలు కలిపితే దాదాపు వందల కోట్ల రూపాయల వ్యాపారం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. చివరి రోజైన శనివారం కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి, టిడిపి ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, మల్లారెడ్డి, మార్తినేని ధర్మారావు, వన్నాల శ్రీరాములు, సీతక్క, వేం నరేందర్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఎడ్ల అశోక్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ, ఈగ మల్లేశం, శ్రీరాముల మురళీ మనోహర్‌, పుల్లూరు అశోక్‌ తదితరులు అమ్మవార్లను దర్శించారు. తమ నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వాకాటి కరుణ మాట్లాడుతూ ఈ నెల 17 నుండి 20వ తేదీ వరకు మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర విజయవంతమైందని తెలిపారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్భందీ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. జాతర విజయవంతం చేసినందుకు జిల్లా అధికారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

చివరిరోజు పోటెత్తిన భక్తులు

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సమ్మక్క-సారలమ్మ గిరిజన జాతర చివరి దశకు చేరుకుంది. శనివారం అమ్మవార్ల వనప్రవేశంతో మేడారం జాతర ముగియనుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు అమ్మవార్ల దర్శనం ఉండడంతో చివరిరోజు కూడా కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఈ జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా గట్టి చర్యలు తీసుకొంది. ఇప్పటి వరకు కోటి 40లక్షల మంది సమ్మక్క-సారలమ్మలను దర్శనం చేసుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. చివరిరోజు సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కుటుంబ సభ్యులతో మేడారం వచ్చారు. ఆయనతో పాటు ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు. డీఐజీ మల్లారెడ్డి, టిడిపి నేతలు రేవంత్‌రెడ్డి, మల్లారెడ్డి, వేంనరేందరెడ్డి తదితరులు కూడా అమ్మవార్లను దర్శించుకున్న వారిలో ఉన్నారు.శుక్ర, శనివారాలు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఆదివారం ఎలాగూ కలిసొచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకుని అందరు మేడారం జాతరకు పయనమయ్యారు. ఎవరికి వారు ప్రైవేటు వాహనాలు మాట్లాడుకుని వెళ్లారు. మరికొంత మంది రైళ్లను ఆశ్రయించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ, మధ్యప్రదేశ్‌ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులు అమ్మవార్లకు ఎత్తుబెల్లం, ముడుపులు, నూతన వస్త్రాలను సమర్పించి దర్శనం చేసుకున్నారు. సీఐ రవికుమార్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు ఏర్పాటు చేసిన క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. క్యూలైన్లలో భక్తులు బారులుతీరారు. బంగారం, పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

కెసిఆర్‌ ముందుచూపుతో సక్సెస్‌: ఇంద్రకరణ్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరిగిన మేడారం జాతర విజయవంతమైందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్విఘ్నంగా జాతర జరిగిందని అన్నారు. జాతర ముగింపు సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి విూడియాతో మాట్లాడుతూ  సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారు అని గుర్తు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. గోదావరి పుష్కరాలు, మేడారం జాతరను విజయవంతం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని చెప్పారు. మేడారంలో దేవాదాయ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. మేడారానికి నిత్యం వచ్చే భక్తుల కోసం సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను సుమారు కోటి 40 లక్షల మంది దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో జంపన్నవాగు జనసంద్రమైంది. జాతర వనదేవతల నామస్మరణతో మార్మోగిపోయింది. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు అమ్మవార్లను దర్శించుకున్నారు. జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు పోలీసులు, అటు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయడంలో విజయవంతమైంది. ఆయా ప్రాంతాల నుంచి భక్తులను మేడారానికి తరలించడంలో ఆర్టీసీ ప్రముఖ పాత్ర పోషించింది. పదివేలకు పైగా బస్సుల్లో

సుమారు 6 లక్షల మంది భక్తులను మేడారానికి చేరవేసింది. ఇక జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్‌, ఏపీ, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారన్నారు. జాతరను సుసంపన్నం చేయడంలో వరంగల్‌ కలెక్టర్‌,జి/-లలా అధికార యంత్రాంగం,పోలీస్‌ యంత్రాంగం బాగా పనిచేసిందన్నారు. ఇందుకు కృషిచేసినవారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

వచ్చే జాతరకు మేడారంలో పచ్చదనం పరుస్తాం: కలెక్టర్‌

మేడారం ఇక పచ్చదనాన్ని సంతరించుకునేలా వచ్చే రెండేళ్లలో పెద్ద ఎత్తున కార్యక్రమాలుచేపడతామని, తదుపి జాతర నాటికి పచ్చని మొక్కలతో స్వాగతం పలికేలా తీర్చిదిద్దాలని నిర్ణయించామని కలెక్టర్‌ వాకాటి కరుణ తెలిపారు. ఇక్కడచెట్లను నరికివేతను అరికట్టడంతో పాటు కొత్తగా వేలాది మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంచాలని నిర్ణయించినట్లు  తెలిపారు. హరిత ప్రసాదం తీసుకున్న వారు మొక్కలను పెంచేలా ప్రతిన తీసుకోవాలని కోరారు. మేడారం జాతరలో ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయని, లక్షలాదిగా ప్రజలు దర్శించుకుని అమ్మవారి దీవెనలు పొందారని అన్నారు. పచ్చని మేడారం కోసం రహదారికి ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్ల ముందు నీడ నిచ్చే చెట్లను, పొలం గట్లపై టేకు మొక్కలు నాటిస్తామన్నారు. వీటిని రాబోయే రోజుల్లో తొలగించే వీలు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. నాటిన ప్రతి మొక్క వృక్షంగా పెరిగే వరకు సంరక్షణ చర్యలు చేపడతామన్నారు. దీని కోసం ముందుగానే అన్ని శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పారు. వచ్చే జాతరకు ఈ ప్రాంతాన్ని హరితవనంగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమన్నారు.  గ్రామస్థులతో సమావేశమమై వారి అభిప్రాయాలు సేకరించాక,. గ్రామంలోని ఖాళీ స్థలాలు, రహదారులు, పొలం గట్ల వెంట మొక్కలు నాటడానికి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రస్తుత ఏర్పాట్లు ప్రజల సందర్శనతో మహాజాతరకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. అందుకే ఎంతో ప్రాధాన్యమున్న మేడారంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పాలని నిర్ణయించామన్నారు. అలాగే తెలంగాణ హరిత హారం పథకం ద్వారా వివిధ శాఖలకు నర్సరీల పెంపకానికి ఇచ్చిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న మేడారం జాతరకు రూ.160 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్‌ చెప్పారు. శుక్రవారం ఆయన వనదేవతల్ని దర్శింకొచున్నారు. నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా జాతరలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మేడారంతో పాటు పరిసన గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. దాదాపు కోటి మంది భక్తులు దేవతల్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారన్నారు. గిరిజన సంస్కృతి, సాంప్రదాయల పరిరక్షణే తమ శాఖ ప్రధాన ఉద్దేశమన్నారు.

అమ్మవార్లను దర్శించుకున్నప్రముఖులు

మేడారం గద్దెలపై కోలువైన శ్రీ సమ్మక్కల గద్దెల పలు రంగాలకుచెందిప వీఐపీలు దర్శించుకున్నారు. వనదేవతలను దర్శించుకున్న ప్రముఖులు తులాభారం తూగి వారి బరువుకు తగ్గ బెల్లాన్ని వనదేవతలకు సమర్పించుకున్నారు. అన్ని శాఖల వారు ఐక్యంగా ప్రణాళికాబద్ధంగా పనిచేయడంతో జాతర సవ్యంగా జరుగుతోంది. చిన్నచిన్న సమస్యలు మినహా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదు. భక్తుల రద్దీ కారణంగా గద్దెలకు వచ్చే సమయంలో కొంత ఇబ్బంది అయ్యింది. మొత్తంగా జాతర విజయమంతం అయినట్లుగా అధికారులు భావిస్తున్నారు. శనివారం అమ్మవార్లు తరలివెళ్లినా మేడారంలో పూజలు కొనసాగుతాయి. 23న పూజారులు సమ్మక్క,సారలమ్మ,పగిడిద్దరాజు, గోవిందరాజులకు తిరుగువారం పండగ నిర్వహిస్తారు. జాతరను నిర్వహించిన పూజారులు, విధులు నిర్వహించిన అధికారులు, వ్యాపారులు తిరుగువారం రోజు అమ్మలకు మొక్కులు తీర్చుకుంటారు. తిరుగువారం పండగను ఈ ప్రాంత ప్రజలు, పూజారులు పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే పూజారులూ ఇదే రోజు అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు.గిరిజన సంక్షేమశాఖ అధికారిగా మేడారం అమ్మవార్లను దర్శించుకోవడం ఆనందంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ గిరిజన శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు.  ఈసందర్బగా తన నిలువెత్తు బంగారాన్ని 90కిలోలు అమ్మవార్లకు సమర్పించుకున్నారు. ఈసందర్బంగా సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ గతంలో ఎన్నడూలేని విధంగా  ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో మేడారం జాతరకు రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన 160కోట్ల రూపాయలతోపాటు పరిసర ప్రాంతాల గిరిజన గ్రామాలన్నింటికి మౌళిక సదుపాయాలు ఏర్పడ్డాయన్నారు. ప్రభుత్వం కేటాయించిన పనులవల్ల నేటికి దాదాపు కోటి మంది భక్తులు హాజరైనప్పటికి ఏవిదమైన ఇబ్బందులు లేకుండా సాపీగా జరిగిందన్నారు. జాతర ప్రారంభ మైనప్పటినుంచి రెండుమార్లు మేడారం పనులను సవిూక్షించడం జరిగిందన్నారు. వచ్చేజాతరలోగా మేడారం సమ్మక్కసారాలమ్మల జాతర సంబందిత గిరిజనుల అభిప్రాయాలు, సూచలన ప్రకారం మరింత అభివృద్ది పరుచుటకు కృషి చేస్తామన్నారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణే తమ శాఖ ప్రధాన ఉద్దేశ్యమన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పక్షాన తులాబారం 56 కిలోల బెల్లాన్ని అమ్మవార్లకు రాష్ట్ర గిరిజనసంక్షేమ, పర్యాటక శాఖమంత్రి అజ్మీరా చందూలాల్‌ సమర్పించారు. శాసనమండలి చైర్మర్‌ స్వామిగౌడ్‌, ఉనశాసనసభాసతి పద్మాదేవేందర్‌ రెడ్డి, రవాణాశాఖ మాత్యులు మహెందర్‌ రెడ్డి, వాణిజ్య పన్నులశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపిలు సీతారాంనాయక్‌, పసునూరి దయాకర్‌, రాజ్య సభసభ్యులు జి.మోహన్‌రావు, గుండు సుదారాణి, శాసనమండలి సభ్యులు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి. ఎమ్మెల్యేలు పుట్టమదు, గంగుల కమలాకర్‌, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జీహెచ్‌ఎంసి మేయర్‌ రాంమోహన్‌, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపి అనురాగ్‌ శర్మ తదితరులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం సమ్మక్క సారాలమ్మల దీవెనలతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరాన్ని ప్రపంచంలోనే గ్లోబల్‌ సిటిగా అబివృద్ది చేసేందుకు కృషి చేయనున్నట్లు జీహెచ్‌ఎంసి మేయర్‌ బొంతు రాంమోహన్‌ పేర్కొన్నారు. శుక్రవారం నాడు తన నిలువెత్తు బంగారాన్ని (92కిలోలు) అమ్మవార్లకు సమర్పించుకున్నారు. శ్రీ సమ్మక్క-సారాలమ్మలకు పూజలు నిర్వహించిన

అనంతరం విూడియాతో మాట్లాడుతూ వరంగల్‌ బిడ్డనైన తాను హైదరాబాద్‌ నగర మేయర్‌గా ఎన్నిక కావడం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీర్వాదంతోపాటు మేడారం తల్లుల దీవెనలు ప్రధానమన్నారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో హైదరాబాద్‌ నగర మొట్టమొదటి మేయర్‌గా తాను నగరవాసుల కనీస సౌకర్యాలతోపాటు సిటీ సర్వతోముఖాబివృద్దికి పనిచేస్తానన్నారు.

ప్లాస్టిక్‌ రహిత ప్రచారం సత్పలితం

తెలంగాణా సంస్కృతికి ప్రతిబింబంగా మారిన మేడారం జాతర ప్రజలనుంచి విశేష ఆదరణ సొంతం చేసుకుంటుంది. తెలంగాణా సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకై ఏర్పాటు చేసిన తెలిగాణా జాగృతి విద్య, వైద్యం ఉపాధి వంటి మౌళిక సౌకర్యాలు సమకూర్చడంలో తమదైన శైలి చాటుకుంటున్నారు. తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత ఆద్వర్యంలో ఏర్పాటైన జాగృతి పువ్వుల పండుగ(బతుకమ్మ) తెలంగాణా సంస్కృతికి పూర్వవైభవం తెచ్చిపెట్టింది. ఎంపి కవిత ఆదేశాలమేరకు వరంగల్‌ జిల్లా జాగృతి కన్వీనర్‌ కొరబోయిన విజయ్‌ కుమార్‌ ఆద్వర్యంలో అమ్మల వారి జాతరలో అధిక కార్యక్రమాలు చేపట్టారు. వెయ్యిమంది స్వచ్చంద కార్యకర్తలతో 16, 17, 18తేదీల్లో వివిద సేవాకార్యక్రమాల్లో అంకితమయ్యారు. మహాజాతరకు ముందు 600 మంది స్వచ్చంద కార్యకర్తలతో మూడు రోజులపాటు మేడారం పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వ్యతిరేక పోరాటంకు ప్రజల్లో అవగాహన కోసం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో బాగంగా ఒక లక్ష పేపర్‌గ్లాస్‌లు, లక్ష పేపర్‌ ప్లేట్స్‌ మేడారంలోని దుఖాణాదారుల వద్ద ప్లాస్టిక్‌ వస్తువులనుస్వాదీనం చేసుకుని వాటి స్థానంలో పేపర్‌ తయారు చేసిన వస్తువులను ఉచితంగా పంపిణీ చేశారు.అలాగే పాలిథిన్‌ కవర్లకు బదులుగా గడ్డితో చేసిన 45వేల సంచులను అందచేసి పరిసర ప్రాంతాల్లోని పాలిథిన్‌ వస్తువులనుఏరివేశారు. పోలీస్‌ వారికి సహకరించుటకు 50 వైర్‌లెస్‌ సెట్స్‌ (పోర్టబుల్‌ మైక్స్‌) అందచేశారు. పర్యావరణపరిరక్షణకై మేడారం గ్రామ ప్రజలకు 5వేల అల్లనేరడి, ఎర్ర చందనం మొదలగు మొక్కలను పంపిణీ చేశారు. ఎంపి కవిత ఆదేశాలమేరకు జిల్లా కన్వీనర్‌ విజయ్‌కుమార్‌ మహాజాతర ప్రారంబానికి ముందు 15రోజులనుంచి జాతర ఏర్పాట్లపై నిరంతరం కృషిచేస్తూ తాగునీటి కోసం మేడారం బస్‌స్టాండ్‌, జంపన్నవాగు వనదేవతల గద్దెల ప్రాంగణం ప్రక్కన మూడు నీటి శుద్ది యంత్రాలను నెలకొల్పి భక్తులకు ఉచిత నీటి సరఫరా చేస్తున్నారు. ప్రతిరోజు జిల్లాజాగృతి శాఖ తన స్వంత ఖర్చులతో వెయ్యి మంది కార్యకర్తలకు వసతి భోజన సౌకర్యాలు కల్పించి భక్తులకు సలమాలు, సూచనలు ఇస్తూ జాతర నిర్వహణలో బాగం పంచుకుంటున్నారు.