జనగామ టిఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డికి చేదు అనుభవం
అభివృద్ది చూపాలంటూ బెక్కల్ గ్రామస్థుల నిలదీత
జనగామ,నవంబర్15(జనంసాక్షి): తాజామాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి చేదు అనుభవం ఎదురయ్యింది. మద్దూరు మండలం బెక్కల్‌లో ప్రచరాం చేస్తుండగా ప్రజలు ఒక్కసారిగా ముత్తిరెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మెల్లగా మొదలైన నిరసనలు తీవ్రస్తాయికి చేరాయి. ఆయన గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఇన్నాళ్లు గ్రామానికి ఏం చేశావంటూ నిలదీశారు. అభివృద్ది అంటూ మభ్య పెట్టే మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. గ్రామస్థులన నిరసనలతో ముత్తిరెడ్డి అలాగే ఉండిపోయారు. కొందరు వారిని వారించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి మాట్లాడుతూ జనగామ నియోజకవర్గంలో అణువణువునా పర్యటించి అందరి కష్టాలు తెలుసుకుని పరిష్కారం దిశగా కృషి చేసిన ఏకైక నాయకుడిగా తాను ప్రజల మనసుల్లో నిలిచిపోయానని అన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో జనగామ ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు కోటి ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంగా అత్యంత వేగంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు.దేశంలోని అనేక రాష్ట్రాలకు తెలంగాణను ఆదర్శంగా నిలిపేందుకు కష్టపడిన కేసీఆర్‌ను ఎదుర్కొ నే దమ్ము..ధైర్యం ఎవరికీ లేదన్నారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల గెలిచినా.. ఓడినా ఎప్పుడూ హైదరాబాద్‌కే పరిమితమయ్యారని ఆరోపించారు. ఆయన ప్రజలకు దూరంగా ఉంటున్నారనే నెపంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆయనకు జనగామ టికెట్ ఇచ్చేందుకు ఆలోచిస్తున్నట్లు ఎద్దేవా చేశారు.