జనగామ బరిలో ఎవరున్నా ఓడిస్తాం
టిఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి
జనగామ,నవంబర్15(జనంసాక్షి): జనగామ బరిలోనే ఉంటానని పొన్నాల అంటున్నారని, తామే పోటీ చేస్తామని టిఎస్ఎస్ అంటున్నదని, ఓడిపోవడానికి ఎవరో ఒకరు తేల్చుకోవాలని జనగామ టిఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. పొన్నాల వచ్చినా ఓటమి కావడం ఖౄయమన్నారు. కోదండరామ్ నిలబడ్డా తాము ఓడిస్తామని అన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ను ఒంటరిగా ఎదుర్కొనే సత్తా లేక చంద్రబాబు, రాహుల్ గాంధీ ఒక్కటయ్యారన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షాలు వచ్చి ప్రచారం చేసినా టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. రైతుల కోసం ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలను కేసీఆర్ తీసుకున్నారన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు రైతులకు మేలు చేస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంటు ఉండదని.. చీకట్లు తప్పవని భయ పెట్టారన్నారు. కానీ కేసీఆర్ ఆ భయాలను పటా పంచలు చేశారన్నారు. వ్యవసాయానికి 24గంటల ఉచితంగా కరెంటు ఇస్తున ఏకైక రాష్ట్రం తెలంగాణయే అన్నారు. ప్రతిపక్షాల నాయకులు మంచీ చెడులు ఆలోచించకుండా ప్రజలకు మేలు జరుగుతున్న పథకాలపై కూడా అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు మంచి పేరు రాకుండా ఉండేందుకు కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు.