జనతాదళ్‌కు ఎంపీ బైజయంత్‌ జేపాండా రాజీనామా

భువనేశ్వర్‌, మే28( జ‌నం సాక్షి ) : ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్‌ చీఫ్‌ నవీన్‌ పట్నాయక్‌కు ఆ పార్టీ పార్లమెంట్‌ సభ్యుడు బైజయంత్‌ జే పాండా షాక్‌ ఇచ్చారు. కొద్దికాలంగా ఈ ఇద్దరు ఒడిశా నేతల మధ్య సత్సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో తాను పార్టీ నుంచి వైదొలగుతున్నట్టు జే పాండే సోమవారంనాడు ప్రకటించారు. తీవ్ర ఆవేదన, బాధాతప్త హృదయంతోనే తాను పార్టీ నుంచి వైదొలగుతున్నట్టు పట్నాయక్‌కు రాసిన ఓ లేఖలో పాండా పేర్కొన్నారు. తన నిర్ణయాన్ని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు కూడా తెలియజేశానన్నారు. గత వారంలో తన తండ్రి బన్సీదర్‌ పాండా కన్నుమూసినప్పటికీ ముఖ్యమంత్రితో సహా పార్టీకి చెందిన ఏ ఒక్కరూ రాకపోడవంతో తనను కలిచివేసిందన్నారు. 87 ఏళ్ల బన్సీధర్‌ పాండా ప్రముఖ పారిశ్రామికవేత్తగా, మానవతావాదిగా మంచిపేరుంది. ఇండియన్‌ మెడల్స్‌ అండ్‌ ఫెర్రో ఎల్లాయీస్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడైన బన్సీధర్‌ పాండా ఈనెల 22న కన్నుమూశారు. కాగా, జేపాండేకు బీజేపీతోనూ, నరేంద్ర మోదీతోనూ సన్నిహిత బంధాలున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. పాండా, బిజూల మధ్య సంబంధాలు దెబ్బతినడానికి ఇదో కారణంగా చెబుతున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభియోగంపై ఈ ఏడాది జనవరిలో జేపాండేను పార్టీ నుంచి బిజూ పట్నాయక్‌ 
సస్పెండ్‌ చేశారు. ఈ నేపథ్యేంలో జేపాండే ఏకంగా పార్టీకి ఉద్వాసన చెబుతున్నట్టు ప్రకటించడం ఒడిశా రాజకీయాల్లో సంచలనమవుతోంది. వచ్చే ఏడాది ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
————————————