జనని సేవ ప్రారంభం
న్యూఢిల్లీ,జూన్ 8(జనంసాక్షి): ప్రయాణంలో శిశువులకు, బాలింతలకు ఉపయోగపడేలా రైల్వేశాఖ సరికొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. ‘జననీ సేవ’గా నామకరణం చేసిన ఈ సేవను రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు బుధవారం ప్రారంభించారు. దీనిలో భాగంగా 25 రైల్వేస్టేషన్లలో వేడిపాలు, వేడినీళ్లు, శిశువులకు అవసరమయ్యే వస్తువులను అందుబాటులో ఉంచారు. దీంతో పాటు 5-12 ఏళ్ల వయసున్న చిన్నారులకు ప్రత్యేక ఆహార మెనూ రూపొందించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి సురేశ్ ప్రభు మాట్లాడుతూ… శిశువుకు పాలు దొరకడం లేదని ఓ బాలింత తనకు ట్వీట్ చేసిందని… దీంతో తాను స్పందించి శిశువుకు వెంటనే పాలు అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితులు చాలామంది తల్లులు ఎదుర్కొంటున్నారని… అందువల్ల వారందరికీ ప్రయోజనకారిగా ఉండేందుకే ‘జననీ సేవ’ను ప్రారంభించినట్లు స్పష్టం చేశారు