జనావాసాల మధ్య వైన్ షాపు తెరిస్తే ఊరుకోం
స్థానికుల హెచ్చరిక
విశాఖపట్టణం,జూలై5(జనం సాక్షి): పాయకరావుపేట వై జుంక్షన్, వద్ద మళ్లీ వైన్ షాపు పెట్టుటకు సన్నాహాలు చేస్తున్నారని ఆ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్నవారు వైన్ షాప్ మొదలైతే మళ్ళి ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు. ఈ సందర్భంగా అక్కడ నివాసముంటున్న ప్రజలు విూడియా సమావేశంలో మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జగత శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ పడితే అక్కడ వైన్ షాపులు ఎక్కువవుతున్నాయి. వీధికో వైన్ షాప్ వెలుస్తోంది.ఒక చోట మాత్రం మద్యం అమ్మడానికి వీలు లేకుండా కేందప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వైన్ షాపులు గుడి దగ్గర ఉన్నా బడి దగ్గర ఉన్నా పట్టించుకోని ప్రభుత్వాలు జాతీయరహదారుల వెంట వైన్ షాపులకు అనుమతి ఇవ్వద్దని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరింది అని అన్నారు. జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులకు కూడా ఈ నియమం వర్తిస్తుంది. జాతీయ రహదారుల పక్కన మద్యం దుకాణాలు ఉండటం వల్ల డ్రైవర్లు తాగి వాహనాలు నడుపుతున్నారని, దీనివల్ల ఏటా హైవే ప్రమాదాల్లో 1.18 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నా రని తెలిపారు. వాటిలో చాలా ప్రమాదాలు మద్యం సేవించడం వలనే జరిగాయని ఆయన తెలిపారు. అందువలన హైవేల పైన ఉన్న వైన్ షాపులను తొలగించాలని ఆయన కోరారు. పాయకరావుపేటలో వైన్ సిండికేట్ మాఫియా లంచాల ఎరతో హైవే పై వైన్ షాపు తెరవడానికి చూస్తున్నారని అన్నారు.నియమాలను ఉల్లంఘించి ఇక్కడ వైన్ షాపు తెరిస్తే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు.