జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య
ఎన్నికల ప్రచారంలో ఉండగా దుండుగుడి కాల్పులు
అక్కడే కుప్పకూలగా ఆస్పత్రికి తరలింపు
చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ప్రకటన
సుదీర్ఘకాలం జపాన్‌కు ప్రధానిగా సేవలు
టోక్యో,జూలై8(జనం సాక్షి ): జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు గురయ్యారు. ఆయనపై శుక్రవారం ఉదయం హత్యాయత్నం జరిగింది. దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ షింజోను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. నారా సిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి తుపాకీతో కాల్చాడు. షింజో అబే ఛాతి, మెడలోకి బుల్లెట్లు దిగినట్లు తెలిసింది. అబేను హుటాహుటిన ఆస్పిటల్‌కు తరలించి వైద్యం అందించారు. కానీ 67 ఏళ్ల షింజో అబే హాస్పిటల్‌లో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ద్రువీకరించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5.03 నిమిషాలకు షింజో మృతిచెందినట్లు హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి.షింజో అబే తన ప్రధాని పదవికి 2020లో రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా ఆయన పదవికి రాజీనామా చేశారు. కానీ ఆయన మాత్రం రాజకీయంగా చురుకుగానే ఉన్నారు. ఆయన రెగ్యులర్‌గా విూడియాలో కనిపించేవారు. కరెంట్ అఫైర్స్ గురించి చర్చించేందుకు ఆయన తరుచూ విూడియాలో కనిపించేవారు. నాటో సభ్యుల తరహాలోనే అణ్వాయుధాల షేరింగ్ అంశాన్ని జపాన్ చర్చించాలని ఫిబ్రవరిలో ఓ డిబేట్‌లో తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా అటాక్ చేసిన నేపథ్యంలో ఆయన ఆ అభిప్రాయాన్ని వినిపించారు. శుక్రవారం నారా పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సయమంలో ఓ ఆగంతకుడు షింజోపై కాల్పులు జరిపాడు. ఎగువ సభకు ఎన్నికల నేపథ్యంలో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ తరపున షింజో ప్రచారం నిర్వహించారు. నారా
తర్వాత క్యోటో, సైతామాలో ఆయన ప్రచారం చేయాల్సి ఉంది. జపాన్ పార్లమెంట్ ఎగువసభకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం నారా నగరంలో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థుల తరఫున అబె శుక్రవారం ఉదయం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ క్రమంలో ఆయన వేదికపై ప్రసంగిస్తుండగా..ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. రెండుసార్లు తుపాకీ పేలిన శబ్దం వచ్చింది. అబె భద్రతా సిబ్బంది వెంటనే నాటు తుపాకీ పట్టుకున్న 41 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని నారా నగరానికి చెందిన టెట్సుయా యమగామిగా గుర్తించినట్లు తెలుస్తోంది. యమగామి 2002 నుంచి 2005 వరకు జపాన్ నౌకాదళంలోని సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ లో పనిచేసినట్లు సమాచారం. పోలీసుల విచారణలో అతడు నివ్వెరపరిచే విషయాలు చెప్పాడంటూ జపాన్ విూడియాలో కథనాలు వచ్చాయి. గతంలో ప్రధానిగా షింజో అబె అందించిన పాలన నచ్చకే .. ఆయనపై కాల్పులు జరిపానని పోలీసులతో యమగామి చెప్పాడని జపాన్ విూడియా పేర్కొంది. జపాన్ చరిత్రలో అత్యధికకాలం ప్రధానిగా చేసిన వ్యక్తిగా అబేకు గుర్తింపు ఉన్నది. 2006 నుంచి 2007, ఆ తర్వాత 2012 నుంచి 2020 వరకు ఆయన ఆ దేశ ప్రధానిగా చేశారు. షింజో అబేది పేరుగల కుటుంబం. ఆయన తండ్రి షింతారో అబే ఆ దేశ విదేశాంగ మంత్రిగా చేశారు. ఇక అబే తాత ఆ దేశ ప్రధానిగా చేశారు.మాజీ ప్రధాని నొబషుకే కిషి మనువడే షింజో అబే. రాజకీయంగా షింజో ఫ్యామిలీకి ఘన చరిత్ర ఉంది. అయినా జపాన్ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా షింజో కొనసాగారు. ప్రధానిగా ఉన్న సమయంలో షింజే తన ఆర్థిక విధానాలతో ఆకట్టుకున్నారు. విదేశాంగ,ఆర్థిక విధానాల వల్ల ఆయనకు ఎబినామిక్స్ అన్న పేరు వచ్చింది.