జమ్మూకాశ్మీలో భారీ వర్షాలు,

w1kcrokzముంచెత్తిన వరదలు

అకాల వర్షాలతో జమ్మూకశ్మీర్‌లో స్తంభించిన జనజీవనం
సహాయక చర్యలు చేపడుతున్న సైన్యం
కశ్మీర్‌ వరదలపై ప్రధాని సమీక్ష

భారీ వర్షాలు, వరదలు జమ్మూ కాశ్మీర్ ను మరోసారి అతలాకుతలం చేస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరపిలేని వర్షాలతో.. నదులు ఉప్పొంగుతున్నాయి. జీలం నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతంలోని పలు ఏరియాలను వరదలు ముంచెత్తుతున్నాయి. పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో జనం అవస్థలు పడుతున్నారు. గత సెప్టెంబర్ తరహాలో వరదలు ముంచెత్తుతాయేమోనన్న భయంతో.. పలువురు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. రహదారులపై వరద నీరు నిలవడంతో పలుచోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఎడతెరపిలేని వర్షాలవల్ల కొండచరియలు విరిగిపడుతుండటంతో..శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు.

వరద ఉధృతి తీవ్రమవడంతో జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. గత సెప్టెంబర్ లో ముంచెత్తిన వరదలు పెను విషాదం మిగిల్చిన నేపథ్యంలో… మళ్లీ అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. రెండు బెటాలియన్ల ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టింది. అటు వరద బాధితుల కోసం పలుచోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. కాగా అకస్మాత్తుగా ముంచెత్తిన వరదల్లో 21 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. అటు పలుచోట్ల వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. శ్రీనగర్‌లోని జేవీఎం ఆస్పత్రిలోకి వరద నీరు చేరడంతో రోగులను వేరే ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

అటు కేంద్ర ప్రభుత్వం కూడా జమ్మూకాశ్మీర్ లో వరద పరిస్థితిని సమీక్షిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాడి వరదల గురించి తెలుసుకుంటున్నారు. అటు పరిస్థితిని అంచనా వేయడం కోసం కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీని జమ్మూకాశ్మీర్‌కు పంపించారు. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇదిలావుంటే రాష్ట్రంలో మరో నాలుగైదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లు వదిలి పునరావాస కేంద్రాలకు చేరుకుంటున్నారు.అకాల వర్షాల కారణంగా జమ్మూకశ్మీర్‌లో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని అన్ని నదులు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో అనేక చోట్ల వంతెనలు, రహదారులు కొట్టుకుపోయాయి. రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. మరికొంతమంది కొండకోనల్లో చిక్కుకుపోయారు. మరోవైపు వరదల కారణంగా కొండచర్యలు విరిగి ఇండ్లపై పడడంతో అనేక మంతి ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ ఘనటలో దాదాపు ఎనిమిది మంది మరనించినట్లు అధికారులు వెల్లడించారు.

భారీ వర్షాల కారణంగా జమ్మూకశ్మీర్‌ రోడ్లన్నీ చెరువును తరపిస్తున్నాయి. దీంతో అధికారులు శ్రీనగర్‌, జమ్మూ జాతీయ రహదారిని మూసివేశారు. మరోవైపు భారత నౌకాదళ, వైమానికదళ అదికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయ పునరావాస కార్యకలాపాలను అధికారులు ఎప్పటికప్పటికీ పరిశీలిస్తున్నారు.

మరోవైపు కశ్మీర్‌ వరదలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ప్రధాని ఆదేశించారు.