జయ ప్రమాణానికి ముహూర్తం

3

న్యాయ నిపుణుల సలహాలు

ఈ నెల 22న ఎమ్మెల్యేలతో భేటీ

చెన్నై,మే20(జనంసాక్షి): పురుచ్చి తళైవి జయలలిత తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు ముహుర్తం ఖరారైంది. మే 23న ఆమె సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఎఐడిఎంకె ప్రకటన విడుదల చేసింది. ఆమె తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన అనంతరం ఆమెను లెజిస్లేచర్‌ నాయకురాలిగా ఎన్నుకున్నట్టు ప్రకటిస్తారు. ఇందుకు 22న లెజిస్లేచర్‌ పార్టీ సమావేశం జరుగనుంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సమావేశమై జయలలితను శాసనసభ పక్ష నాయకురాలిగా ఎన్నుకోనున్నారు. ఇదే రోజు తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం పదవికి రాజీనామా చేసి జయకు మార్గం సుగమం చేయనున్నారు.  గవర్నర్‌ కొణిజేటి రోశయ్య  ఆమెతో సీఎంగా ప్రమాణస్వీకారం చేయిస్తారు. మద్రాసు యూనివర్సిటీలోని సెంటినరీ ఆడిటోరియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉందని సమాచారం. ఎమ్మెల్యేల సమావేశం జరిగిన వెంటనే సీఎం ఒ.పన్నీరు సెల్వం తన పదవికి రాజీనామా చేస్తారని, మరుసటి రోజు జయలలిత సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్‌ సరస్వతి విూడియాకు వెల్లడించారు. చెన్నైలోని ఆర్కే నగర్‌ అన్నాడీఎంకే ఎమ్మెల్యే వెట్రివేల్‌ ఇటీవల శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జయ ఈ స్థానం నుంచి పోటీ చేయవచ్చని భావిస్తున్నారు. ఏడు నెలల క్రితం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జయలలితను దోషీగా ప్రకటించడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి అనర్హురాలయ్యారు. దీంతో ఆమె పోటీచేసిన శ్రీరంగం నుంచి ఉప ఎన్నిక జరిగింది. ఇటీవల కర్ణాటక హైకోర్టును కింది కోర్టు తీర్పును నిలుపుదల చేస్తూ జయను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో ఆమె మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేందుకు లైన్‌ క్లియరైంది.

ఇక కేసులకు సంబంధించి  ఆమె ఇంకా న్యాయసలహాలు తీసుకుంటున్నరు. మరోవైపు సుప్రీంలో సవాల్‌ చేస్తామని సుబ్రమణ్యస్వామి హెచ్చరించడమే గాకుండా అందుకు సిద్దం అవుతున్నారు. దీంతో జయ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలితకు విముక్తి కలగడంతో సీఎంగా ఆమె పీఠమెక్కే అవకాశం వచ్చింది. అన్నాడీఎంకే అధినేత్రికి జయలలితకు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టేందుకు అవకాశం రావడంతో శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మరో వైపు ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలో పోటీపై ప్రతిపక్షాలు డైలమాలో ఉన్నాయి. ఉప ఎన్నికలో అధికార పార్టీకే ఓటర్లు పట్టం కడతారనే నమ్మకం ఉండటంతో బరిలోకి దిగే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. ఈ ఎన్నికలు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కోసమే జరగనుండటంతో ఆమెకు భారీ మెజారిటీ వచ్చేలా చూడాలని పార్టీ శ్రేణులు నిర్ణయించుకున్నాయి. ఉప ఎన్నిక జరిగితే  ఫలితం ఏకపక్షం కానుందని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. సాధారణ ఎన్నికలకు మరో ఏడాది ఉండటంలో ప్రస్తుత పోటీ చేసి తలబొప్పి కట్టించుకోవద్దని కూడా విపక్షనేతలు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఎన్నికలో జయకు మద్దతు పలికడం ద్వారా వచ్చే సాధారణ ఎన్నికల్లో సీట్లు పొందాలని పలు చిన్న పార్టీలు ఆలోచిస్తున్నాయి. ‘అమ్మ’కు దీటైన ప్రత్యర్థిని నిలిపేందుకు విపక్షాలతో కూటమి ఏర్పాటు చేయాలని, వచ్చే శాసనసభ ఎన్నికల్లోనూ ఇదే కూటమిని కొనసాగించవచ్చని కూడా ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం డీఎంకే ఇదే ఆలోచనలో ఉంది.

దాదాపు తొమ్మిది నెలలపాటు ఇంటికే పరిమితమైన  జయలలిత ఈ నెల 22న ప్రజల మధ్యకు రానున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు బెయిల్‌ ఇవ్వడంతో కర్ణాటక జైలు నుంచి విడుదలై  తన ఇంటికి వచ్చారు. అప్పటి నుంచి పార్టీ కార్యకర్తలకు కూడా కనిపించలేదు. కర్ణాటక హైకోర్టు ఈ కేసులో ఆమెను నిర్దోషిగా ప్రకటించినా అప్పటికీ ఆమె ఇంటి వెలుపలికి వచ్చి అభివాదమైనా చేయలేదు. ఎట్టకేలకు ఈ నెల 22న ప్రజల మధ్యకు రానున్నారు. ఆ రోజు ఉదయం 7 గంటలకు అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశం పార్టీ కార్యాలయంలో జరగనుంది. ఆమెను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాక జయ అక్కడికి చేరుకోనున్నారు. శాసనసభ్యులు, కార్యకర్తలను కలిశాక మధ్యాహ్నం 2 గంటలకు మౌంట్‌ రోడ్డులోని ఎంజీఆర్‌ విగ్రహానికి… అనంతరం అన్నాదురై, పెరియార్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.