జరా “భద్రమన్నా” ఓటరన్నా….

నేడు నేతలు వంగి వంగి దండాలు
పెడుతుంటే “జరా భద్రమన్నా ఓటరన్నా”
రేపువాళ్ళే గెలిస్తే పవరొస్తే పంగనామాలు
పెడతారని “అర్థమన్నా ఓటరన్నా”

నేడు అడుగడుగున నీకు గొడుగు
పడుతుంటే “జరా భద్రమన్నా ఓటరన్నా”
రేపు ఆ గొడుగు కర్రతోనే నీ వెనుక
లోతుగగోతులు తీస్తారని “అర్థమన్నా ఓటరన్నా”

నేడు నీవు కసురుకుంటున్నా
విసురుకుంటున్నా నేతలు
నిన్ను కౌగిలించుకుంటూ వుంటే
“జరా భద్రమన్నా ఓటరన్నా”
రేపువాళ్ళే ఎత్తులు పై ఎత్తులతో నిన్ను
చిత్తు చేస్తారని”అర్థమన్నా ఓటరన్నా”

నేడు చీటికిమాటికి నిన్ను ఇంద్రుడు
చంద్రుడంటే “జరా భద్రమన్నా ఓటరన్నా”
రేపువాళ్ళే గుడిని గుడిలోని లింగాన్ని
మింగేఘనులని “అర్థమన్నా ఓటరన్నా”

నేడు నీవు ఛీ! ఛీ అన్నా వాళ్ళు చిరునవ్వు
నవ్వుతూ ఉంటే “జరా భద్రమన్నా ఓటరన్నా”
రేపువాళ్ళే నీ వెనుక మేమున్నామంటూనే
నిన్ను పెన్నుపోటు పొడుస్తారని “అర్థమన్నా ఓటరన్నా”

ఇదీ ఒరిజినల్ మేటరన్నా ఓ ఓటరన్నా….
జరా భద్రమన్నా ఓ అమాయకపు ఓటరన్నా…

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి    ‌
హైదరాబాద్……9110784502