జర్నలిస్టులపై ఆంక్షలు లేవు
హెల్త్ కార్డులు, అక్రిడేషన్లు ఇవ్వాలని నిర్ణయం
సంక్షేమానికి రూ.10 కోట్ల నిధులు విడుదల
సీఎంతో సమీక్ష అనంతరం అల్లంనారాయణ వెల్లడి
హైదరాబాద్,ఫిబ్రవరి21(జనంసాక్షి): రాష్ట్ర సచివాలయంలో జర్నలిస్టులపై ఆంక్షలు ఉండబోవని తెలంగాణ ప్రెస్ అకాడవిూ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఈమేరకు శనివారం ఆయన ప్రెస్ అకాడవిూ భవన్‌లో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో చర్చించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సచివాలయంలో జర్నలిస్టులపై రెగ్యులేషన్ మాత్రమే ఉంటుందని తెలిపారు. కాగా, సెక్రటేరియట్‌లోకి ఎక్కువ సంఖ్యలో జర్నలిస్టులు రావడంతో పరిపాలనాపరమైన ఇబ్బందులు వస్తున్నాయని, వాటిని అధిగమించేందుకు జర్నలిస్టులను రెగ్యులేట్ చేసే అంశంపైఈసమావేశంలో చర్చించే అవకాశం ఉందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.ఇకపోతే తెలంగాణ జర్నలిస్టులకు ఆరోగ్యకార్డులు, అక్రిడేషన్ కార్డులను ఇవ్వడానికి సీఎం కేసీఆర్ అంగీకరించినట్లు అల్లం నారాయణ తెలిపారు. ప్రెస్ అకాడవిూలో పలు పత్రికలు, టీవీ ఛానళ్ల సంపాదకులతో సమావేశమైన సీఎం కేసీఆర్ జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. ఈ సమావేశం వివరాలను అల్లం నారాయణ విూడియాకు వెల్లడించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం గత బడ్జెట్ లో ప్రభుత్వం కేటాయించిన రూ. 10 కోట్ల నిధిని కూడా సోమవారం విడుదల చేయనున్నట్లు సీఎం హావిూ ఇచ్చారని అల్లం తెలిపారు. ఈ నిధిని ప్రెస్ అకాడవిూ ఖాతాలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీని ఆపదలో ఉన్న జర్నలిస్టులను ఆదుకోవడానికి ఉపయోగించనున్నట్లు చెప్పారు. దీనికోసం సీనియర్ జర్నలిస్టులు, సంపాదకులతో ఓ కమిటీ వేసినట్లు చెప్పారు. అక్రిడేషన్లు, హెల్త్‌కార్డులకు సంబంధించి కూడా ఓ కమిటీని వేసినట్లు ఆయన వెల్లడించారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పంపిణీకి విధివిధానాలు చెప్పాలని సీఎం జర్నలిస్టులను అడిగినట్లు అల్లం నారాయణ తెలిపారు.జర్నలిస్టులందరికీ ఆరోగ్య కార్డుల సమస్య తీరనుంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి సీఎం కేసీఆర్‌తో అకాడవిూ భవన్‌లో చర్చలు జరిపామని, జర్నలిస్టుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. జర్నలిస్టుల ఆరోగ్య కార్డులు, అక్రిడేషన్‌లపై 9 మందితో కమిటీని వేశామని, కమిటీలో కే రామచంద్రమూర్తి, జహీరుద్దీన్, కే శ్రీనివాస్‌రెడ్డి, కట్టా శేఖర్‌రెడ్డి, శైలేష్‌రెడ్డి, క్రాంతి, వెంకటకృష్ణ, గౌరీ శంకర్, వనజ సభ్యులుగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. వారం రోజుల్లో కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని వివరించారు. జర్నలిస్టుల భవన నిర్మాణానికి కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.