జర్మనీ చేతిలో భారత్‌ హాకీ జట్టు ఓటమి

మెల్‌బోర్న్‌ .డిసెంబర్‌ 4: ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత్‌కు తొలి పరాజయం ఎదురైంది. జర్మనీతో జరిగిన మూడో లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 2-3 తేడాతో పోరాడి ఓడింది. వరుసగా రెండు విజయాలతో జోరు విూదున్న భారత జట్టు ఇవాల్టి మ్యాచ్‌లో కూడా అదరగొట్టే ప్రదర్శన చేసింది. ఒలింపిక్‌ ఛాంపియన్స్‌ అయిన జర్మనీని నిలువరించేందుకు ప్రయత్నించింది. ఆరో నిమిషంలో గుర్విందర్‌సింగ్‌ తొలి గోల్‌ చేసి ఆధిక్యాన్నందించాడు. అయితే కాసేపటికే జర్మనీ స్కోర్‌ సమం చేసింది. తొలి అర్థభాగం ముగిసే సరికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. రెండో అర్ధభాగంలో కూడా మొదట భారతే ఆధిపత్యం కనబరిచింది. 46వ నిమిషంలో నితిన్‌ తిమ్మయ్య పెనాల్టీ కార్నర్‌ ద్వారా గోల్‌ సాధించడంతో ఆధిక్యం 2-1కు పెరిగింది. ఈ దశలో వేగంగా పెంచిన జర్మనీ ఆటగాళ్ళు భారత డిఫెన్స్‌పై ఒత్తిడి పెంచారు. గోల్స్‌ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్ళారు. తర్వాత భారత్‌ స్కోర్‌ సమం చేసేందుకు ప్రయత్నించినా కాలేకపోయింది. గోల్‌ చేసే అవకాశాలను మన ఆటగాళ్లు వృథా చేసుకున్నారు. దీంతో టోర్నీలో భారత్‌కు తొలి ఓటమి ఖాతాలో చేరింది. ఈ మ్యాచ్‌లో ఓడినప్పటకీ… గోల్స్‌ ఆధిక్యం ద్వారా పూల్‌ ఎ లో భారత జట్టే అగ్రస్థానంలో కొనసాగుతోంది.