జల సాధనే ఆయన జీవితం
– జలసాధన సమరం పుస్తకావిష్కరణలో కేసీఆర్
హైదరాబాద్, మార్చి 12 (జనంసాక్షి) :
జీవితాంతం నల్గొండలోని ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరు అందించేందుకు పోరాడిని దుస్సెర్ల సత్యనారాయణ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. సత్యనారాయణ సాగించిన జలపోరాటంపై జర్నలిస్టు ఎలికట్టి శంకర్‌రావు రాసిన ‘జలసాధన సమరం’ పుస్తకాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించారు. రెండు దశాబ్దాలకుపైగా సత్యనారాయణ సాగించిన జల సాధన ఉద్యమంపై తెలంగాణ నెటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ బ్లాక్‌వాయిస్ ఈ పుస్తకాన్ని ముద్రించింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, విషతుల్యమైన నల్గొండ భూగర్భ జలాల వల్ల లక్షలాది మంది వికలాంగులా మారడంతో కలత చెందిన సత్యనారాయణ బ్యాంక్ ఉద్యోగాన్ని వదులుకొని వారికి శుద్ధజలాలు అందించేందుకు అవిశ్రాంత పోరు సలిపారని కొనియాడారు. ప్రజలకు తాగునీరు అందించాల్సిన పాలకులు నిమ్మకు నీరిత్తినట్లుగా వ్యవహరిస్తుంటే వారి బాధ్యతను గుర్తు చేసేందుకు ఎన్నో పోరాటాలు సాగించి జైలుకు సైతం వెళ్లారని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ నుంచి నల్గొండ జిల్లాలోని 900 గ్రామాలకు తాగునీరు అందించాలని ఆయన సాగించిన పోరాటం ప్రస్తుత తెలంగాణ సాధన ఉద్యమానికి దిక్సూచీ అని కొనియాడారు. తెలంగాణ ఏర్పడకపోతే ఈ ప్రాంతం మొత్తం ఎడారిలా మారిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తేనే నల్గొండకు ఫ్లోరైడ్ పీడ విరగడవుతుందని, సీమాంధ్రుల పాలనలో రేపటితరం ఇంకా కష్టాలు ఎదుర్కోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. సత్సనారాయణలాంటి నిఖార్సయిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, నల్గొండ జిల్లా కోసం తన భవిష్యత్‌ను, జీవితాన్ని వదలుకొని ఆయన సాగించిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. సత్యనారాయణ జన్మదినం సందర్భంగా కేసీఆర్ ప్రత్యేకంగా కేక్ తెప్పించి కట్ చేయించారు. సత్యనారాయణ చదివిన ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సహాధ్యాయులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం టీవీ సీఈవో కె. రామచంద్రమూర్తి, డాక్టర్ పి. వినయ్‌కుమార్, స్వామిగౌడ్, డాక్టర్ సూరేపల్లి సుజాత, విద్యాసాగర్‌రావు, వేనపల్లి పాండురంగరావు, విరాహత, డాక్టర్ చెరకు సుధాకర్, వీకే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.