జస్టిస్ సుదర్శన్ రెడ్డికి హైదరాబాద్‌లో ఘన స్వాగతం
` నేడు పలు వేదికలపై ప్రసంగించనున్న జస్టిస్ బీఎస్ రెడ్డి
` రాష్ట్ర ఎంపీలతో భేటీ అయ్యే అవకాశం
` తెలంగాణ పౌర సమాజం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్
` టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మీట్ ది ప్రెస్
హైదరాబాద్, ఆగస్ట్ 31 (జనంసాక్షి) :
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. న్యూఢల్లీి సహా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి తన అభ్యర్థిత్వానికి మద్దతు పలకాలని కోరిన ఆయన.. ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఎంపీ మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్, అనిల్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, కార్పొరేషన్ చైర్మన్ ఫహీం తదితరులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలతో ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. నేడు మధ్యాహ్నం 12 గంటలకు బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో ప్రెస్‌మీట్ ఉంటుందని తెలిపారు. అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు టీయూడబ్ల్యూ (ఐజేయూ) మీట్ ది ప్రెస్‌కు జస్టిస్ సుదర్శన్ రెడ్డి హాజరుకానున్నారు. అదేవిధంగా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 11 గంటలకు మౌనం వీడుదాం.. మన బిడ్డకు అండగా గొంతు విప్పుదాం అనే అంశంపై తెలంగాణ పౌర సమాజం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ జరగనుంది. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ జడ్జీలు, న్యాయవాదులు, పౌర హక్కుల నేతలు, పాత్రికేయులు హాజరుకానున్నారు. ఈ రౌండ్‌టేబుల్‌లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతుగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఎంపీలు నిలవాల్సిన అవసరముందని ప్రముఖులు ప్రసంగించనున్నారు.
తెలుగు ప్రతిష్టను పెంచే చారిత్రక అవకాశం
త్వరలో జరగబోయే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి అన్ని పార్టీల ఎంపీలు మద్దతు ఇవ్వాలని ఢల్లీిలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడా వ్యవహారాల సలహాదారు ఏ.పీ.జితేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం న్యూఢల్లీిలో ఆయన, ఉపరాష్ట్రపతి పదవికి ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి విషెస్ తెలిపారు. జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. జస్టిస్ సుదర్శన్ రెడ్డి దేశ సమగ్రత, రాజ్యాంగ విలువలకు అచంచలంగా కట్టుబడిన వ్యక్తి అని కొనియాడారు. న్యాయరంగంలో ఆయన ఇచ్చిన కీలక తీర్పులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన చూపిన తపన, రాజ్యాంగ స్ఫూర్తి పట్ల ఆయన నిబద్ధత అందరికీ ఆదర్శమని అన్నారు. కాబట్టి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇది తెలుగువారి ప్రతిష్టను దేశ రాజధానిలో పెంచే చారిత్రక అవకాశం అని అన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయం సాధిస్తే, ఢల్లీిలో తెలుగు ప్రజల గౌరవం, ప్రతిష్ట మరింత పెరుగుతుందని, తెలుగు ఎంపీలందరూ ఆయనకే మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిష్పాక్షిక దృక్పథం, న్యాయశాస్త్రంలో అపారమైన అనుభవం, రాజ్యాంగం పట్ల అచంచలమైన నిబద్ధతతో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి పదవికి గౌరవాన్ని తీసుకువస్తారని చెప్పారు. ఆయన విజయం తెలుగువారికి గర్వకారణం అవుతుందని పేర్కొన్నారు. ఈ భేటీలో జితేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ మల్లు రవి తదితరులు ఉన్నారు.