జాతీయ కోచ్‌గా ఉంటూ.. అకాడమీ ఎలా నడుపుతావ
.జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తీరుపై బాంబే హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. భారత బ్యాడ్మింటన్ సంస్థ (బీఏఐ) చైర్మన్, జాతీయ కోచ్, సెలక్షన్ ప్యానల్ అధ్యక్షుడు అయిన గోపీచంద్.. ప్రైవేట్ ట్రైనింగ్ అకాడవిూని నడపడం నైతికం కాదని, న్యాయస్థానం సోమవారం వ్యాఖ్యానించింది. న్యాయనుగుణంగా ఇది సహేతకం కాదని పేర్కొంది. ‘నైతికంగా చూస్తే.. సెలక్షన్ ప్యానల్ అధ్యక్షుడు అయిన కోచ్ ప్రైవేట్ అకాడవిూని నడపకూడదు. అతని మంచి కోచే కావొచ్చు. దాన్ని మేం తప్పుబట్టడం లేదు. కానీ, పారదర్శకత, సహజన్యాయం ప్రకారం జాతీయ కోచ్, సెలక్షన్
ప్యానల్‌లో ఉండి ప్రైవేట్ క్యాంప్ నడపడం సరికాదని’ చీఫ్ జస్టిస్ మోహిత్ షా, జస్టిస్ ఏవీ మెహతాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆలిండియా నేషనల్ కోచింగ్ క్యాంప్‌లో చేరేందుకు నిరాకరించడంతో గోపీచంద్ తనను మానసికంగా వేధిస్తున్నాడని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ప్రజక్తా సావంత్ (19) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం స్పందిస్తూ.. వివరణ ఇవ్వాలని భారత బ్యాడ్మింటన్ సంస్థతో పాటు గోపీచంద్ అకాడవిూలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది. నవంబర్ 6న జరిగిన విచారణ సందర్భంగా ప్రజక్తాను క్యాంపులోకి చేర్చుకోవాలని బీఏఐని ఆదేశించింది. విచారణ అనంతరం ప్రజక్తా తరఫు న్యాయవాది పియూష్ షా విలేరులతో మాట్లాడుతూ.. నవంబర్ 17న ప్రజక్తా క్యాంపునకు వెళ్లే సరికి అప్పటికే క్రీడాకారులు చైనా టోర్నీకి బయల్దేరారని తెలిపారు. వచ్చే జనవరిలో మరో క్యాంపు ఉందని, ఆ క్యాంప్‌లోకి ప్రజక్తాకు ప్రవేశం కల్పించాలని కోర్టు ఆదేశించిందన్నారు.