జాతీయ చిహ్నంపై నిలదీస్తాం

జాతీయ చిహ్నంపై నిలదీస్తాం
సార్నాథ్‌ స్థూపానికి భిన్నంగా ఎందుకు
మండిపడుతున్న విపక్ష నేతలు

న్యూఢల్లీి,జూలై13 (జనంసాక్షి): కొత్త పార్లమెంటు భవనంపై ప్రధాని మోదీ కాంస్య జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించడంపై రేగిన వివాదం మరింత ముదిరింది. దీనిపై ఊరుకునేది లేదని కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ ప్రకటించారు. అసలు జాతీయ చిహ్నాన్ని ఇది ప్రతిబింబించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
సార్నాథ్‌ స్థూపానికి భిన్నంగా ఎలా రూపొందిస్తారని అన్నారు. పాత చిహ్నంలో శాంతచిత్తంగా ఉండే సింహాలను.. కొత్త దాంట్లో ఉగ్రరూపంలో చూపించారని విపక్షలు ధ్వజమెత్తాయి. రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లోగా దీనిని తొలగించాలని పట్టుబడుతున్నాయి. అయితే ఎలాంటి సవరణా చేయలేదని చిహ్నం శిల్పులు సునీల్‌ దేవరే, రొవిూల్‌ మోజెస్‌ స్పష్టం చేశారు. కొత్త జాతీయ చిహ్నాన్ని కాంస్యంతో తయారుచేశారు. 9,500 కిలోల బరువున్న ఈ చిహ్నం ఎత్తు ఆరున్నర అడుగులు. క్రీ.పూ. 250 ప్రాంతంలో మౌర్య సామాజ్యంలో అశోక చక్రవర్తి.. వారాణసీలోని సార్‌నాథ్‌ వద్ద అశోక స్తంభంపై తామరపుష్పంలో ఉండే ఈ నాలుగు ఆసియా సింహాల చిహ్నాన్ని ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. తామర పుష్పం లేకుండా సింహాల చిహ్నాన్ని రాజ్యాంగ రూపకర్తలు 1950లో మన జాతీయ చిహ్నంగా తీసుకున్నారు. అందులోని అశోక చక్రాన్ని జాతీయ పతాకం నడుమన చేర్చారు. పాత పార్లమెంటు భవనంపై జాతీయ చిహ్నం ఉంది. తాజాగా రూపొందించిన జాతీయ చిహ్నాన్ని కొత్త పార్లమెంటు భవనంపై ప్రధాని సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తమను ఆహ్వానించలేదని ప్రతిపక్షాలు ఆగ్రహంతో ఉన్నాయి. కార్యనిర్వాహక వర్గం అధినేతగా దానిని ఆయనెలా ఆవిష్కరిస్తారని నిలదీశాయి. పైగా చిహ్నంలో మార్పులు చేసి దానిని, రాజ్యాంగాన్ని అవమానించారని ఆరోపించాయి. అసలు జాతీయ చిహ్నంలో సింహాలు శాంతంగా ఉన్నాయని.. కొత్త చిహ్నంలో మనుషులను చంపే సింహాలుగా ఉన్నాయని ఆర్‌జేడీ ధ్వజమెత్తింది.జాతీయ చిహ్నంలో ఉగ్రసింహాలా అశోక సింహాలతో కూడిన జాతీయ చిహ్నానికే ఇది అవమానకరమని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ జవహర్‌ సర్కార్‌ ట్వీట్‌ చేశారు. ’పార్లమెంటు, జాతీయ చిహ్నం భారత ప్రజలందరివీ. ఒక్క మనిషి(మోదీ)కి చెందనవి కావు’ అని కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గొగోయ్‌ పేర్కొన్నారు. రాజ్యాంగం చేసిన అధికార వికేంద్రీకరణను కార్యనిర్వాహక అధిపతి అయిన ప్రధాని నాశనం చేశారని సీపీఎం ధ్వజమెత్తింది. జాతీయ చిహ్నాన్ని మోదీ ఆవిష్కరించాల్సింది కాదని.. రాజ్యాంగ నిబంధనలను ఆయన ఉల్లంఘించారని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి అనిల్‌ బలూనీ అన్నారు. అయితే దీనిని సవరించి పాతపద్దతిలోనే చూపాలని కాంగ్రెస కోరుతోంది. దీనిపై అన్ని పక్షాలతో కలసి నిలదీస్తామని అన్నారు.

తాజావార్తలు