జాతీయ నాయకులతో చంద్రబాబు భేటీ

బాజపాకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నం
మమతా బెనర్జీతో ప్రత్యేకంగా చర్చలు
బెంగళూరు,మే23( జ‌నం సాక్షి): బెంగళూరు పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మరోమారు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేలా ముందుకు కదిలారు. కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరుకు వచ్చిన  ఆయన ఇక్కడ పలువురు సిఎంలు, నేతలను కలిశారు. అలాగే  తన పిలుపు మేరకు ఇక్కడ భాజాపాకు వ్యతిరేకంగా ఓటు వేసిన తెలుగువారికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు బెంగళూరుకు చేరుకున్న చంద్రబాబుకు అక్కడి తెలుగువారు ఘనస్వాగతం పలికారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా వివిధ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ఈ బెంగళూరు పర్యటన అవకాశంగా మలచుకోవాలని చంద్రబాబు భావించారు. ఇందులో భాగంగానే ప్రత్యేక ¬దా, విభజన హావిూల సాధన కోసం భాజపాయేతర పక్షాలను ఇందుకు అనుకూలంగా మద్దతు కోరారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక తొలిసారిగా మాయావతి, మమతా బెనర్జీ, అరవింద్‌ కేజీవ్రాల్‌తో చంద్రబాబు బెంగళూరులో భేటి అయ్యారు. వీరితో విడివిడిగా భేటి అయిన ఆయన.. ప్రాంతీయ పార్టీల బలోపేతంపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఏపీలో పరిణామాలు, భాజపా కుట్ర రాజకీయాలను ఆయా నేతల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తమ తమ రాష్ట్రాల్లోని పరిస్థితులను ఆయా నేతలు చంద్రబాబుకు వివరించారు. ప్రాంతీయ పార్టీలన్నీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందని మమతాబెనర్జీ బాబుతో అన్నట్లు సమాచారం. కర్ణాటక పరిణామాలే ఇందుకు నాంది కావాలని నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. భాజపాకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి అవసరం ఉందని మాయావతి ప్రస్తావించినట్లు సమచారం. జాతీయ స్థాయిలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలనే అంశం నేతల భేటీల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి అవసరమని, కూటమిని ఏర్పాటు చేయాలని  చంద్రబాబుకు మమత బెనర్జీ సూచించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నేతలు కలసుకుని కూటమి ఏర్పాటుపై చర్చలు జరిపారు. మాయావతి, కేజీవ్రాల్‌ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రాల  హక్కులను హరించేలా 15వ ఆర్థికసంఘం సిఫార్సులు ఉన్నాయన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యాలపై కేజీవ్రాల్‌, మమత ఏకీభవించారు. 1971 జనాభా లెక్కలపై వారు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రాంతీయ పార్టీల అధినేతలను కలుసుకున్నారు. బీజేపీతో విడిపోయిన తర్వాత తొలిసారిగా ఏపీ రాష్టాన్రికి జరిగిన అన్యాయం, కేంద్రంపై పోరాటాన్ని చంద్రబాబు వారికి వివరించారు.
రాష్ట్రాలు బలోపేతం అయితేనే దేశం బలపడుతుందని పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. చంద్రబాబునాయుడు.. మమతతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని చంద్రబాబు ఆమెకు వివరించారు. అనంతరం ప్రస్తుత దేశంలో చోటుచేసుకున్న రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. అనంతరం మమత విూడియాతో మాట్లాడుతూ.. కుమారస్వామికి మద్దతు ఇచ్చేందుకు తామంతా బెంగళూరు వచ్చినట్లు చెప్పారు. ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్‌కు తామంతా ఉండగా ఉంటామని.. దేశాభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని చెప్పారు. దేశ భవిష్యత్‌, జాతీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏం చేయాలన్నా ధైర్యంగా చేస్తామన్నారు. తమిళనాడులోని తూత్తుకుడి ఘటన విచారకరమని మమత అన్నారు.
———-