జాతీయ నులిపురుగుల వారోత్సవాలను విజయవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ పమేల సత్పతి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి జిల్లాలో ఒకటి నుండి పందొమ్మిది సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ వచ్చే సెప్టెంబరు 9, 15 తేదీలలో ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అందించి, వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు కలెక్టరు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులి పురుగుల వారోత్సవం నిర్వహణపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించబడింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో ఒకటి నుండి 19 సంవత్సరాల వయస్సు గల 1,66,936 మంది పిల్లలు ఉన్నారని, వీరందరికి జాతీయ నులి పురుగుల వారోత్సవం పురస్కరించుకొని వచ్చే సెప్టెంబరు 9, 15 తేదీలలో వంద శాతం ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అందించాలని, దీని కోసం పిల్లల తల్లిదండ్రులకు అవగాహన చర్యలు పెద్ద ఎత్తున చేపట్టాలని ఆదేశించారు. అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలలో వంద శాతం విద్యార్థులకు టాబ్లెట్స్ అందించాలని, గ్రామాలలో గ్రామ సర్పంచ్ ల సహకారంతో అంగన్వాడీ, ఆశా సిబ్బంది సమన్వయంతో ఇంటింటి సర్వేతో పిల్లలను గుర్తించాలని తెలిపారు. శుక్రవారం సభ, బుధవారం బోధన కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని, అధికారులు సమన్వయంతో వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు.
సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మల్లిఖార్జునరావు, జిల్లా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చిన్నా నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఓ శ్రీనివాసరావు, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి మంగ్హానాయక్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి యాదయ్య, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి శ్రీమతి కృష్ణవేణి, డిప్యూటీ డిఎంహెచ్ ఓ డాక్టర్ ప్రశాంత్, ఆర్.బి.ఎస్.కె. కోఆర్దినేటరు డాక్టర్ వినోద్, సఖీ ఎన్టీఓ డాక్టర్ ప్రమీల, డాక్టర్ సుమన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.