*జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.*

*CPI జిల్లా కార్యదర్శి కొండన్న విజ్ఞప్తి.*
మక్తల్ అక్టోబర్ 09 (జనంసాక్షి) ఈనెల 14 నుండి 18 వ తేదీ వరకు 5 రోజుల పాటు విజయవాడ నగరంలో జరుగుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 24 వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని  CPI నారాయణపేట జిల్లా కార్యదర్శి కొండన్న విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మఖ్తల్ మండల కేంద్రంలో జరిగిన సిపిఐ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్ని ఆయన మాట్లాడారు. అనంతరం జాతీయ మహసభల ప్రచార సామాగ్రిని , స్టిక్కర్ లు , కరపత్రాలు , గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కొండన్న మాట్లాడుతూ 1925 డిసెంబర్ 25 న కాన్పూర్ నగరంలో ఆంగ్లేయుల కబంధ హస్తాల చెర నుండి భారతజాతి విముక్తికై ఏర్పడిన నాటినుండి గత 97 సంవత్సరాలుగా నిఖార్సైన,  నిర్విరామ, నిబద్ధత కలిగిన సంఘటిత సమరశీల పోరాటాలను నిర్మించిందని ఆయన కొనియాడారు. ప్రపంచ చరిత్రలోనే ఈ భూమండలంలో ఎక్కడా జరగని నైజాం నిరంకుశ పాలనపై తిరుగుబాటు బావుటాను ఎగురవేసి సువర్ణాక్షర లిఖిత చారిత్రక మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి 10 లక్షల ఎకరాల దొరలు, భూస్వాముల భూములను పేదలకు పంచి, 3 వేల గ్రామాలను విముక్తి చేసిన ఘనత సిపిఐ పార్టీ దేనని కొండన్న గుర్తుచేశారు.  తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 4 వేల మంది అమరులతో పాటు, దేశవ్యాప్తంగా అనేక వేలమంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోరాట యోధులు రక్తతర్పణ చేసి, దేశంకోసం ప్రాణాలర్ఫించిన ఘన చరిత్ర కలిగిన సిపిఐ పార్టీ 24 వ జాతీయ మహసభలు తెలుగు రాష్ట్రంలో జరుగుతున్నాయని అన్నారు. ఈ మహాసభలకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి D రాజా, మాజీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యదర్శులు డా” కే నారాయణ, అతుల్ కుమార్ అంజన్ లతోపాటు లోక్‌సభలో సిపిఐ పార్లమెంటరీ పక్ష నేత కే సుబ్బరాయన్, రాజ్యసభలో సిపిఐ పక్ష నేత బినయ్ విశ్వం , పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలూ, జాతీయ నేతలతోపాటు, 29 దేశాల సౌహార్ధ ప్రతినిధులు పాల్గొనబోయే ఈ మహాసభలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో CPI – AITUC నాయకులు నర్సిములు, శివయ్య,  నాగన్న, తిరుపతయ్య,  మహేష్, రాములు, రాజు, మల్లేష్, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.