జాతీయ స్థాయిలో తెలంగాణపై మాట్లాడండి

పార్లమెంట్‌లో గళం విప్పండి
రాజ్‌నాథ్‌ను కోరిన కోదండరామ్‌
హైదరాబాద్‌, జూన్‌ 3 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై జాతీయ స్థాయిలో మాట్లాడాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కోరారు. సోమవారం హైదరాబాద్‌కు వచ్చిన రాజ్‌నాథ్‌ను జేఏసీ నాయకులు కలిసి తెలంగాణపై మాట్లాడినట్లు కోరానని తెలిపారు. ఆయనతో భేటీ అనంతరం కోదండరామ్‌ తెలిపారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించాలని కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై ఆజాద్‌ వ్యాఖ్యలు నమ్మశక్యంగా లేవని, తీవ్రంగా ఖండిస్తున్నామని కోదండరామ్‌ చెప్పారు. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని కోదండరాం అన్నారు. ఇప్పటికే తెలంగాణా ప్రజలను ఆజాద్‌ మాయమాటలు చెప్పి మోసం చేశాడన్నారు. తెలంగాణాను హోంమంత్రి నెలరోజుల్లో పరిష్కరిస్తానన్నాడని మీడియా ప్రశ్నిస్తే నెలంటే 30 రోజులేనా, వారం అంటే ఏడు రోజులేనా అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన సందర్బాలు చూశాక ఆయన మాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలంగాణా పై కార్యాచరణ ఉంటేనే కాంగ్రెస్‌ను నమ్ముతామన్నారు. తాము చేపట్టబోతున్న చలో అసెంబ్లీ కార్యక్రమంలో ప్రభుత్వం చట్టవ్యతిరేకమైన రీతిలో వ్యవహరిస్తే జాతీయ స్థాయిలో స్పందించాలని కోరామన్నారు. సీనియర్‌ నాయకులు పార్టీని వీడినందువల్లే ఈ స్టేట్‌మెంట్‌ అన్నారు. ఇందులో ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు.