జార్ఖండ్‌లో కాంగ్రెస్‌ గన్‌ కల్చర్‌

ఇరు గ్రూపుల ఘర్షణ
గాల్లో కాల్పులు
రాంచీ, జూన్‌ 21 (జనంసాక్షి) :
జార్ఖండ్‌ కాంగ్రెస్‌లో వర్గపోరు తీవ్రతరమైంది. ఇరు గ్రూపుల మధ్య నెలకొన్న వివాదం చివరికి గాల్లోకి కాల్పుల వరకూ వెళ్లింది. ఏఐసీసీ పరిశీలకుడి సాక్షిగా జార్ఖండ్‌ గన్‌ కల్చర్‌ మరోసారి తేటతెల్లమైంది. శుక్రవారం మధ్యాహ్నం జార్ఖండ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ భగత్‌ అధ్యక్షతన పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేవానికి ఇటీవల పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన బీకే హరిప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగానే జార్ఖండ్‌ సీఎల్పీ నాయకుడు రాజేంద్రప్రసాద్‌సింగ్‌, ధన్‌బాద్‌ ఎమ్మెల్యే మన్నన్‌ మల్లిక్‌ వర్గీయుల మధ్య వివాదం చెలరేగింది. దీంతో రెచ్చిపోయిన రాజేంద్రప్రసాద్‌ వర్గీయులు 15 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎవరు గాయపడకున్నా సమావేశంలో, సమీప ప్రాంతాల్లో కలకలం చెలరేగింది. ఈ ఉదంతంపై స్థానిక డీఎస్పీ ఎస్పీ సింగ్‌ స్పందిస్తూ కాంగ్రెస్‌ కార్యాలయం వెలుపల కాల్పుల శబ్దం వినిపించినట్లుగా తమకు సమాచారం అందిందన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నామని, ఇంతకుమించిన వివరాలు ఇప్పుడే వెల్లడిరచలేమని పేర్కొన్నారు. అయితే కాల్పుల వ్యవహారంపై ఏఐసీసీ తీవ్రంగా స్పందించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ప్రసాద్‌ మాట్లాడుతూ ఈ చర్యను పార్టీ క్రమశిక్షణ రాహిత్యంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై 24 గంటల్లోగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జేపీసీసీ అధ్యక్షుడిని ఆదేశించామన్నారు.