జిల్లాలో ఎరువుల కొరత లేదు

జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌
నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): జిల్లాలో నత్రజని, యూరియాతోపాటు ఇతర ఎరువుల నిలువలను సిద్ధంగా ఉంచామని, యూరియా కొరత కేవలం తాత్కాలికమేనని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌ పేర్కొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయాన్ని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంతో పాటు ఎరువుల గిడ్డంగిని ఎడపల్లి సొసైటీ చైర్మన్‌ పోల మల్కారెడ్డి, మండల వ్యవసాయాధికారి సిద్ద రామేశ్వర్‌లతో కలిసి బుధవారం పరిశిలించారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, రైతులతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సమావేశమైన గోవింద్‌ పంటలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా గోవింద్‌ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 3 లక్ష 21 వేల 455 ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారని, అలాగే రైతులు మొక్కజొన్న, సోయాబీన్‌, పసుపు,
ఇతర పంటలు కలిపి మొత్తం 4 లక్షల ఇరవై వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తుండగా, రైతులకు 4 లక్షల యాభై వేల ఎకరాలకు సరిపడా ఎరువుల నిలువలను సిద్ధం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామలఃన్నారు. రైతులు అధిక మొత్తంలో నత్రజని ఎరువైన యూరియాను వాడటం వల్ల పంటలు ముదురు ఆకుపచ్చ రంగుకు మారడంతో అనేక చీడపీడలను ఆకర్షించేందుకు ఆస్కారం ఉంటుందని, అందుకే రైతులు అధిక మొత్తంలో యూరియా వాడకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. రైతులు తమ భూసారానికి అనువుగా ఎరువుల వాడకాన్ని చేపట్టి, మంచి దిగుబడులను పొందాలని సూచించారు. యూరియా కొరతపై స్పష్టతనిచ్చిన జిల్లా వ్యవసాయాధికారి ప్రతి ఏడాది రైతులు ఆగస్టు నెలాఖరు వరకు వరి నాట్లు వేస్తుండే వారని, ఈ ఏడాది జులై నెలలోనే ఆశాజనకంగా వర్షాలు కురియడంతో రైతులు జులై నెలలోనే అధిక మొత్తంలో వరి నాట్లు పూర్తి చేయడంతో యూరియా కొరత ఏర్పడిరదన్నారు. రైతులు ఎరువుల వాడకాన్ని ఓ ప్రణాళికా బద్ధంగా వాడుకోవడంతో వరిలో ఎండాకు తెగులు, పాము పొడ, మొగి పురుగు వంటి తదితర చీడలను నివారించే వీలుంటుందన్నారు. జిల్లా వ్యవసాయాధికారి వెంట ఠానాకలాన్‌ సర్పంచ్‌ భాస్కర్‌ రెడ్డి, మండల వ్యవసాయధికారి సిద్ధిరామేశ్వర్‌, బోధన్‌ ఏడీఏ సంతోష్‌ నాయక్‌, స్థానిక రైతులు ఉన్నారు.