జిల్లాలో టిఆర్‌ఎస్‌కు అనుకోని మద్దతు

ఎమ్మెల్యేల చేరికతో మరింతగా పెరిగిన బలం
కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని షాక్‌
ఖమ్మం,మార్చి11(జ‌నంసాక్షి):  జిల్లా రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. లోక్‌సభ ఎన్నికల ముందు జరుగుతన్న పరిణామాలు కాంగ్రెస్‌కు అడ్రస్‌ లేకుండా చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.. కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి జిల్లాలో రోజురోజుకూ అగమ్యగోచరంగా మారి దిక్కుతోచని స్థితికి చేరుతోంది. అలాగే టిఆర్‌ఎస్‌ బలోపేతం అవుతోంది. తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. ఆ పార్టీ ఇల్లెందు నియోజకవర్గం ఎమ్మెల్యే బాణోతు హరిప్రయనాయక్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే సండ్ర వెంకట వీరయ్య, రేగా కాంతారావులు పార్టీలో చేరుతామని ప్రకటించారు. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. ఇప్పటికే పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించి, సీఎం కేసీఆర్‌ను కలిసారు.  తాను టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి  సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయాలని స్వయంగా ఎమ్మెల్యే రేగా ప్రకటించారు. ఆ దెబ్బ నుంచి కోలుకోకముందే ఆ పార్టీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది.  ఎమ్మెల్యే రేగా తీసుకున్న నిర్ణయాన్ని తిప్పికొట్టాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలే రేగా నిర్ణయాన్ని స్వాగతించారు. రానున్న రోజుల్లో జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితులు
దాపురిస్తున్నాయని పార్లమెంట్‌ ఎన్నికల ముందు జరిగిన పరిణామాలు ప్రత్యక్ష తార్కాణాలుగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజాగా  ఇల్లెందు నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బాణోతు హరిప్రియ నాయక్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో ఇద్దరు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడంతో పార్టీకి 50శాతం దెబ్బ తగిలిందనే చెప్పాలి.  సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆకర్షితులవుతున్న వీరు పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అలాగే సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య కూడా టిడిపిని వీడి టిఆర్‌ఎస్‌ఓల చేరబోతున్నారు. వీరి చేరికతో జిల్లాలో టిఆర్‌ఎస్‌ బలపడింది. దీంతో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఏకపక్షం కానున్నాయి.