జిల్లాలో భారీ వర్షాలపై గంగుల ఆరా

అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాలని ఆదేశం
కలెక్టరేట్‌లో అధికారులతో పరిస్థితిపై సవిూక్ష
బండి సంజయ్‌ చేసేది ఈర్ష్యదీక్ష అని విమర్శలు

కరీంనగర్‌,జూలై11(జనంసాక్షి): జిల్లాలోభారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయని, రోడ్ల విూద నీళ్ళు నిలువకుండా చర్యలు చేపట్టాలని మంత్రి గంగుల అధికారులను ఆదేశించారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వారి సహాయం అందించడానికి అన్నిశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలని మంత్రి ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయం లో కలెక్టర్‌ ఆర్‌ వి కర్ణన్‌, అడిషనల్‌ కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌, మేయర్‌ వై సునీల్‌ రావు,డిప్యూటీ మేయర్‌
చల్ల స్వరూపరాణి లతో కలిసి నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై అన్ని శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. విద్యార్ధులకు ఇబ్బందులు కలగకూడదనే విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చినట్టు తెలిపారు. తెలంగాణలో వరద కారణంగా ఏర్పడే నష్టాలను ప్రభుత్వం అంచనా వేస్తోందన్నారు. ఇదిలావుంటే బండి సంజయ్‌ చేసేది మౌన దీక్ష కాదు..తెలంగాణపై ఈర్ష్య దీక్ష అని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. గతంలో వడ్లు కొంటామని మాట తప్పినట్లుగా..విూరు ముందస్తు ఎన్నికలకు వస్తామంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. విూ మాటలు నమ్మే స్థితిలో లేమని..దమ్ముంటే మోడీతో ముందస్తు ఎన్నికల ప్రకటన చేయించాలన్నారు. మోడీ డేట్‌ ప్రకటిస్తే..ముందస్తుకు సిద్దమని సీఎం కేసీఆర్‌ కూడా చెప్పారని గంగుల తెలిపారు. కేంద్రం నుంచి రాష్టాన్రికి రావాల్సిన నిధులు తెచ్చేలా బండి సంజయ్‌ కు ఆ దేవుడు శక్తినివ్వాలని ఆకాంక్షించారు. ధరణితో 98 శాతం భూ సమస్యలు పరిష్కరించబడ్డాయని చెప్పారు. త్వరలో జరిగే రెవెన్యూ సదస్సులో కొద్దిపాటి సమస్యలు కూడా 100శాతం పరిష్కారమవుతాయని మంత్రి గంగుల తెలిపారు. అందరి అకౌంట్లలో 15 లక్షలు వేస్తానన్న మోడీ కోసం ప్రతీ ఏటీఎం దగ్గర కుర్చీలు వేద్దామని ఎద్దేవా చేశారు. తెలంగాణకు కేసీఆర్‌ మహారాజే అని.. ధరణి వల్లే అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా.. ప్రధాని మోదీ దగ్గర కుర్చీ వేద్దామా? అని ప్రశ్నించారు. 15 లక్షలు ఇస్తా అన్నావ్‌ అని కుర్చీ వేద్దామా? అని ఎద్దేవా చేశారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ పెంచినందుకు ఇద్దరం కలిసి మోదీ దగ్గరకు వెళ్లి కుర్చీ వేద్దామని బండి సంజయ్‌ను ఉద్దేశించి గంగుల పేర్కొన్నారు.ఉద్యోగాల కల్పన, గ్యాస్‌ ధర పెంపు, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు, ఎల్‌ఐసీ ప్రైవేటీకరణ వంటి వాటిపై మౌనదీక్ష చేద్దామని బండికి సవాల్‌ విసిరారు. ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ బీసీకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం డిమాండ్‌ చేయాలన్నారు. బీసీల్లో కులగణన ఎందుకు చేయడం లేదన్న మంత్రి..చట్టాలు చేసే అధికారం ఉన్నా ఎందుకు చేయడం లేదన్నారు.