జిల్లాలో వరదలపై మంత్రి కెటిఆర్ ఆరా
కలెక్టర్ తదితరులతో ఫోన్ ద్వారా పరిస్థితిపై చర్చ
రాజన్న సిరిసిల్ల,జూలై11(జనం సాక్షి): జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో పరిస్తితులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఆరా తీసారు. అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డేతో సోమవారం ఉదయం మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాలో వర్షాలు, వరద పరిస్థితులను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. మిడ్ మానేరు, అప్పర్ మానేరు, అనంతగిరి ప్రాజెక్టుతో పాటు మానేరు నది వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కాలువలు, చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్స్ వద్ద కూడా రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లు, భవనాల శాఖ అధికారులు.. బ్రిడ్జిలు, కల్వర్టులను పరిశీలిస్తూ, అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. తెగిపడ్డ విద్యుత్ తీగలు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులను కేటీఆర్ ఆదేశించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, విద్యుత్, పోలీసు, ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని చెప్పారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని కేటీఆర్ కోరారు