జిల్లాలో వైద్యుల సమ్మె
శ్రీకాకుళం, జూన్ 25 : ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జిల్లాలోని వైద్యులు సోమవారం నాడు బంద్ నిర్వహించారు. భారత జాతీయ వైద్య సంఘం పిలుపుమేరకు చేపట్టిన ఈ సమ్మెలో జిల్లాలోని పలువురు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు పాల్గొని ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చట్ట ప్రకారం ఎన్నికైన ఎంసిఐ (మెడికల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా) సభ్యులను తొలగించి కేంద్ర ప్రభుత్వం బోర్డు ఆఫ్ గవర్నర్లను ఏర్పటు చేయడాన్ని ఖండించారు. వైద్యులకు మూడేళ్లు శిక్షణ ఇచ్చిన అనంతరం బ్యాచ్‌లర్ ఆఫ్ రూరల్ హెల్త్ కేర్ పేరుతో వారు గ్రామాల్లో పనిచేయాలన్న నిబంధనను ఉపసంహరించుకోవాలన్నారు. పశువైద్య అధికారులు ఐదేళ్లు శిక్షణ తీసుకొని వైద్యం చేస్తారని అటు వంటిది వైద్యులకు మూడున్నర ఏళ్లు శిక్షణ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ యోచనను వారు తప్పుపట్టారు. ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.