జిల్లా వ్యాప్తంగా తగ్గనున్న పత్తి సాగు
పెరగనున్న కంది పంట: వ్యవసాయ శాఖ అంచనా
ఆదిలాబాద్,మే24(జనం సాక్షి): జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళికను వ్యవసాయ అధికారులు ఇప్పటికే రూపొందించారు. ఈ సీజన్‌లో పత్తి పంట సాగును తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుండగా సోయాబీన్, కంది పంటలు విస్తీర్ణం పెరగనుంది. ఈ మేరకు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అధికారులు రైతులకు అందుబాటులో ఉంచారు. జిల్లా వ్యాప్తంగా గతేడాది రైతులు పత్తి పంటను 1,42,048 హెక్టార్లలో సాగు చేయగా ఈ సంవత్సరం లక్షా 24 వేల హెక్టార్లు పత్తి పంట సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి 16వేల హెక్టార్లలో ఈ పంట తక్కువగా సాగవుతుంది. జిల్లాలో ఈ యేడాది సోయాబీన్ 40 వేల హెక్టార్లలో వేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. గతేడాదితో పోలి స్తే ఈ సారి 20 వేల హెక్టార్లలో సోయాబీన్ ఎక్కువగా సాగువుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కంది పంట విస్తీర్ణం కూడా పెరగనుంది. జిల్లాలో 92 వ్యవసాయ క్లస్టర్‌లు ఉండగా ఏఈవోలు, ఇతర సిబ్బంది గ్రామాల్లో వివిధ పంటలను సాగుచేసే రైతులు వివరాలు సేకరించారు. ఏ పంటలను ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తారనే విషయాలను తెలుసుకున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా వానాకాలం పంటలు సాగు ప్రణాళికలను సిద్ధం చేశారు. జిల్లాలో లక్షా 12వేల మంది రైతులు ఉండగా ఎక్కువగా వానాకాలం పంటలను సాగుచేస్తారు. ఈ సీజన్‌లో పత్తి, సోయాబిన్, కంది పంటలను వేస్తారు. రైతుబంధు పథకంలో భాగంగా ప్రభుత్వం అన్నదాతలకు ఈ సీజన్‌లోని పంట పెట్టుబడి కోసం ఎకరాకు రూ.4వేల చొ ప్పున పంపిణీ చేయడంతో పెట్టుబడికి ఢోకా లేకపోవడంతో ఉత్సాహంగా ఉన్నారు. ఏటా రైతులు వానాకాలం పంటల సీజన్‌కు 15 రోజుల ముందుగానే పెట్టుబడుల కోసం దళారులు, వ్యాపారులను ఆశ్రయించేవారు. పెట్టుబడి కింద ఎరువులు సైతం నాసిరకంగా ఉండడంతో రైతులు ఎంతో కష్టపడి పంటలు సాగుచేసినా దిగుబడులు సరిగా వచ్చేది కాదు. దీంతో రైతులు నష్టపోయి అప్పులు తీర్చలేని పరిస్థితులు ఉండేవి. విత్తనాలతో పాటు డీఏపీ, యూరియాతో పాటు రైతులు వినియోగించే ఇతర ఎరువులు ఏ మేరకు అవసరమవుతాయో వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు తయారు చేశారు. రైతుబంధు డబ్బులతో విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన సాయంతో తాము కోరుకున్న విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసే అవకాశం వచ్చింది.