జీఎస్టీపై ఏంటీ డ్రామా?

` పెంచిది మీరే.. తగ్గించింది మీరే..
` వసూళ్లు చేసింది వెనక్కి ఇస్తారా! : హరీశ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): మోసగించడం, దోచుకోవడంలో కాంగ్రెస్‌, భాజపా దొందూ దొందేనని మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీశ్‌రావు (%నaతీఱంష్ట్ర Raశీ%) విమర్శించారు. ఒక పార్టీది మోస చరిత్ర, మరో పార్టీది ద్రోహ చరిత్ర అన్నారు. చోటా భాయ్‌, బడే భాయ్‌ ఇద్దరిదీ ఒకే తీరు అని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండల భాజపా నేతలు హరీశ్‌రావు సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో సంగారెడ్డి జడ్పీ స్థానం తమ పార్టీదే అన్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో గులాబీ జెండా ఎగురుతుందని చెప్పారు. భాజపా, కాంగ్రెస్‌ రెండు పార్టీలు తెలంగాణకు శత్రువులే అని పేర్కొన్నారు. ‘‘8 మంది ఎంపీలను గెలిపించారన్న కృతజ్ఞత కూడా భాజపాకు లేదు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలే కేంద్రానికి ప్రాధాన్యం. జీఎస్టీ పెంచింది మీరే.. తగ్గించినట్లు డ్రామాలు ఆడుతున్నది మీరే. తెలంగాణకు కేసీఆర్‌, భారత రాష్ట్ర సమితినే శ్రీరామరక్ష. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపాకు బుద్ధి చెప్పాలి’’ అని హరీశ్‌రావు అన్నారు
సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ
సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో రిజర్వేషన్లు లేక రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరిగిందని అందులో పేర్కొన్నారు. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లలో స్థానిక రిజర్వేషన్‌ కల్పించలేదన్నారు. దీంతో వందలాది విద్యార్థులు పీజీ సీట్లు కోల్పోతున్నారని వివరించారు. ఏపీలో మేనేజ్‌మెంట్‌ కోటా కింద 85 శాతం సీట్లు స్థానికులకే ఇస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయ లోపంతో 450 పీజీ సీట్లు ఆల్‌ ఇండియా కోటాకు వెళ్తున్నాయని తెలిపారు. మేనేజ్‌మెంట్‌ కోటాలో 85 శాతం స్థానిక రిజర్వేషన్‌ తక్షణం అమలు చేయాలని.. ప్రస్తుతం విడుదల చేసిన పీజీ ప్రవేశాల నోటిఫికేషన్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కొత్త జీవో జారీ చేసి రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలన్నారు.