జీఎస్టీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

55AQ

– ఇది అన్ని పార్టీల విజయం

– ప్రధాని మోదీ

న్యూఢిల్లీ,ఆగస్టు 8(జనంసాక్షి):జిఎస్టీ బిల్లు ఆమోదంతో టాక్స్‌ టెర్రరిజాంపై విజయం సాధించామని ప్రధాని మోడీ అన్నారు. దీంతో టాక్స్‌ భూతం నుంచి బయటపడుతామని అన్నారు. లోక్‌సభలో జీఎస్టీ బిల్లుకు అన్ని పక్షాలు మద్దతు ఇచ్చాయని ప్రధాని మోడీ అన్నారు. మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇది ప్రజాస్వామ్య విజయమని ప్రధాని మోదీ అన్నారు. పన్నుల ఉగ్రవాదం నుంచి దేశం బయటపడిందని మోదీ చెప్పారు. ఒకే దేశం – ఒకే పన్ను విధానం అని ప్రధాని మోదీ అన్నారు. అంతిమంగా వినియోగదారుడికి ప్రయోజనం చేకూరుతుందని మోదీ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర నమ్మకంతో పనిచేయాలని మోదీ చెప్పారు. జాతి ప్రయోజనాలే ముఖ్యమని.. రాజకీయ ప్రయోజనాలు కాదని ప్రధాన మంత్రి మోదీ అన్నారు.  వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) సవరణ బిల్లుకు మద్దతు ఇస్తున్న పార్టీలన్నింటికీ ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ.. ‘జీఎస్‌టీ సవరణల బిల్లులో విజయం ఏ ఒక్క పార్టీదో కాదు.. ఈ విజయం అందరిదీ’ అన్నారు. జీఎస్‌టీ అమలుతో పన్ను ఎగవేత సమస్యపై విజయం సాధిస్తామన్నారు. సీఎంగా పనిచేసిన అనుభవం తనకు సమస్యలను ఎదుర్కోవడంలో కలిసివస్తోందన్నారు. జీఎస్‌టీ అమలు విషయంలో ముఖ్యమంత్రుల సమస్యలు ఎలా వుంటాయో తెలుసునన్నారు. జీఎస్టీ చిన్న ఉత్పాదనే అయినా.. దాంతో కచ్చితమైన రక్షణ లభిస్తుందన్నారు. కేంద్రం, రాష్ట్రల మధ్య విశ్వాసం పెంపొందాలని ఆయన ఆకాక్షించారు. జీఎస్టీ బిల్లుపై అనేక సంప్రదింపులు జరిపామని.. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లతోనూ చర్చించామనీ ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మొత్తంగా ఇది దేశ చరిత్రలో చారిత్రక బిల్లుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. జీఎస్టీ అంటే గ్రేట్‌ స్టెప్‌ బై టీమిండియాగా పేర్కొన్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందడం దేశ ప్రజల విజయమని, ప్రజాస్వామ్య విజయమని అన్నారు. బిల్లు కోసం అందరి సూచనలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రాలు , కేంద్రం మధ్య విశ్వాసం ఉండాలని తెలిపారు. జీఎస్టీ ద్వారా పన్ను ఎగవేతను నివారించ వచ్చని అన్నారు. దేశాభివృద్దికి అందరి కృషి అవసరమన్నారు. సమస్యలను పరిష్కరించడంలో తనకు సీఎంగా పనిచేసిన అనుభవం ఉపయోగ పడుతుందన్నారు. జీఎస్టీ అమలు విషయంలో ముఖ్యమంత్రుల సమస్యలు ఎలా ఉంటాయో తనకు తెలుసన్నారు.  అంతకుముందు జీఎస్టీ సవరణల బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ బిల్లుపై అన్ని రాష్ట్రాలతో  సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. పన్ను రేటును జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయిస్తుందన్నారు. జీఎస్టీ బిల్లుకు కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీ వీరప్ప మొయిలీ తెలిపారు.