జీడిమామిడి తోటలపై హక్కులు ఇవ్వాలి
భద్రాద్రి కొత్తగూడెం,మార్చి29(జనంసాక్షి): అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు చెందిన పలువురు గిరిజనులు అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం వద్ద ఉన్న ప్రభుత్వ జీడిమామిడి తోటను వీఎస్‌ఎస్ సభ్యులకు తిరిగి అప్పగించాలని కోరుతున్నారు. అటవీ అధికారులు తోటను వేలం వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని, కొంతనగదుకు తోటను అప్పగిస్తే జీడిగింజలు ఏరుకొని ఆదాయం సమకూర్చు కుంటామని వారు అంటున్నారు. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఇటీవల వారు విన్నవించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిఅధికారులతో చర్చిస్తానని హవిూ ఇచ్చినట్లు టీఆర్‌ఎస్ నేతలు కొందరు తెలిపారు. వ్యవసాయ భూములను సాగు చేసుకుంటున్న అర్హులైన రైతులందరికీ భూ హక్కు పట్టాలు అందించటం జరుగుతుందని గతంలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర రావు అశ్వారావుపేట రైతులకు భరోసా ఇచ్చారు. భూ రికార్డుల ప్రక్షాళనతో వివాదాలు పరిష్కారం అవుతాయని తెలిపారు. రైతు సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే రైతులకు రుణమాఫీ అందించటంతోపాటు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా, రాయితీపై యంత్ర పరికరాలు, విత్తనాలు, ఎరువుల అందిస్తోందని వివరించారు. అదేవిధంగా ఉద్యాన తోటల పెంపకానికి కూడా సబ్సిడీలు మంజూరు చేస్తున్నామని అన్నారు. వ్యవసాయ పెట్టుబడి భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ప్రతి సీజన్‌లో ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు సీజన్‌లకు రూ.8 వేల ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని అన్నారు. ఈ పథకం రైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.