జీవన సంధ్యా సమయంలో…
ఎన్నో ఆశలతో,ఆకాంక్షలతో కని పెంచి, పెద్ద చేసిన “పెద్దరికం” నవతరం చేతిలో నగుబాటు పాలై, అగచాట్లు పడుతున్నది.నడక నేర్పిన నాటితరం నడత చెడిన నేటితరం చేతిలో వంచనకు గురై అలమటిస్తున్నది.తపించిన మనసు,శ్రమించిన కాయం కొరగానిదై కాలగర్భంలో కలిసే జీవన సంధ్యా సమయంలో మిగిలింది ఆవేదన…అరణ్యరోదన.
గతమంతా గాయాలే!హృదయం చెమర్చి పెల్లుబికిన గేయాలే!!స్వేదంతో తనువంతా తడిపి,రక్త మాంసాలనే మూలధనంగా వెచ్చించి, ఎముకల గూడైనా చలించక తపించి, కూటికోసం- గూటి కోసం అహరహం శ్రమించిన త్యాగమూర్తులు తుదకు అస్థిపంజరాల్లా,ప్రాణమున్న శవాల్లా కొట్టుమిట్టాడుతున్నారు.గుక్కె
స్వేదాన్నే సంపదగా మార్చి, రక్తాన్నే ఇంధనం గా చేసి, సర్వం సమకూర్చితే, పెరిగి పెద్దవారైన బిడ్డలంతా ఈసడించుకుని వెళ్లగొడితే, జవసత్వాలుడిగి, బిక్కచచ్చి,బావురుమని ఏడ్చింది వృద్దాప్యం. గుండె లోతుల్లో దించిన శూలం అశ్రుధారలను కురిపిస్తే మానవత్వం సిగ్గుతో తలవంచింది.గుండెలపై తన్నిన బిడ్డల కోసం ఈసురోమని ఏడ్వడమెందుకని వృద్ధాశ్రమం చోటిచ్చింది. మనసు చచ్చిన మనిషి రూపం మరో మారు చచ్చి, ప్రేతాత్మలా జనించి వికట్టాటహాసం చేసింది.కడదాకా కన్నీళ్ళే తోడురాగా, కండలన్నీ అరగదీసి కాయం కృశిస్తే, ఓపికంతా ఆవిరైతే, చెమట చుక్కలే నూనె చుక్కలై ప్రాణదీపాలకు,ఆయువు నందిస్తే తుదకు మిగిలేది మూతి విరుపులు, ఈసడింపులు.కష్టాలతో కాయమంతా కరిగిపోయి,నలిగిపోతే చమురు లేని దీపం కొడిగట్టి ఆరిపోదా?కాలం కరుణ లేనిది..కష్టాలే శరణ్యమని శాసించింది. ఆ శాసనమే శిలాశాసనంలా మారింది.కలలన్నీ కన్నీరై, కనుల వెంట ధారలా ప్రవహిస్తుంటే కనికరం లేని నేటి నవనాగరిక తరం కళ్ళప్పగించి చూస్తుంటే,వయోభారం వెంటాడి,వేధిస్తే గతకాలపు కష్టమంతా గతించిన చరిత్రలా పునరావలోకానికే కాని పట్టెడు మెతుకులకు కొరగాదు.
తమ సంతానానికి సంపాదనకై కన్నపేగు ఆరాటం…అలుపెరుగని పోరాటం.ఈ పోరాటంలో విజేతలైనా,ఎదిగిన బిడ్డల ముందు నిత్య పరాజితులే. కనిపెంచిన సంగతి మరచి కన్నవారి పాలిట కాలయమూల్లా మారుతున్న కరకు రాతి కసాయి మూకల వలలో వంచనకు గురై విలవిలా ఏడుస్తున్న వృద్ధుల వెతలు ఆలకించేదెవరు? కష్టార్జితాన్ని పరమాన్నంలా భోంచేసి, బ్రతకిచ్చిన వారిని బయటకు గెంటేసే ఆటవిక విన్యాసం లో జన్మనిచ్చిన వారికి అలుపు…జన్మనొందిన వారికి గెలుపనే బలుపులా మారింది. బ్రతుకు పాటకు పల్లవై, జీవన సంగీతానికి శృతిలయలై నిరంతర శ్రమైక జీవన వీణా గానానికి తంత్రులై బాసటగా నిలిచిన వారిని నిలువెత్తున ముంచే నవనాగరిక సంతానం శివాలెత్తి చిందేస్తున్నది. వాత్సల్యాన్ని వార్ధక్యం పేరుతో త్రుంచేసి, వృద్ధాశ్రమాలకు గెంటేసి, బ్రతికుండగా కాటికి పంపేసే కఠినాత్ముల ముందు వృద్ధాప్యం నలిగిపోయి,పాదాక్రాంతమవుతున్నది
ఆఖరి మజిలీ కోసం అన్వేషణ సాగిస్తున్న వయసుడిగిన మానవ జీవులకు సన్నని వెలుగురేఖలు వృద్దాశ్రమాల రూపంలో అల్లంత దూరంలో సాక్ష్యాత్కస్తున్నాయి. వయసుడిగి, జీవన సంధ్యా సమయంలో గతిలేక వృద్ధాశ్రమాల తలుపు తడితే హృదయపు తలుపులు మూసేసి హాయిగా నిద్రపోతున్నది మానవ రూపం పులుముకున్న నాగరికం.ఈ పరిస్థితులు మారాలి. ఈ దుర్ధినాలు పోవాలి. సద్భుద్ధితో వృద్దతరాన్ని గౌరవించి, వారికున్న మానవ హక్కులను కాపాడి వారి ఆరోగ్యాన్ని సంరక్షించి, సమాజంలో వారిని కూడా అందరితో సమానంగా ఆదరించాలి. వృద్దులను ఈసడించుకుని,హింసించే తత్వం మారాలి. పెద్దల పట్ల గౌరవభావం పెరగాలి.“మూతబడ్డ యువతరం గవాక్షాలు తెరుచుకోవాలి. నేటి అమానుష ప్రపంచంలో వయసుడిగి అలసిన గుండె గతి తప్పి,శృతి లేని రాగమై శూన్యంలో కలిసిపోతున్నది. ఆలంబన కరువై, గుండె అర్ధాంతరంగా అగిపోతున్న లక్షలాది గుండెలకు ఆఖరి దశలో భద్రత కరువైపోతున్నది.
– సుంకవల్లి సత్తిరాజు.
(సోషల్ ఎనలిస్ట్,కాలమిస్ట్)