జీవోలను గోప్యంగా ఉంచాలనుకోవడం తప్పు


ఇది ప్రజలను వంచించడమే అతప్ప మరోటి కాదు
పారదర్శక పాలన చెప్పి చీకటి వ్వయహారాలు ఎందుకు
వైసిపిఐ మండిపడ్డ జనసేన నేత పోతిన మహేశ్‌
విజయవాడ,ఆగస్ట్‌18(జనంసాక్షి): ప్రభుత్వం చేసే నిర్ణయాల పై దాపరికం ఎందుకని…ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిపై జనసేన నేత పోతిన వెంకట మహేష్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ జీవోలను గోప్యంగా ఉంచానుకోవడం సరికాదన్నారు. ఇది ప్రజలను మోసంచేయడమే అవుతుందన్నారు. అంటే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నామని జగన్‌ అంగీకరిస్తున్నారా అని ప్రశ్నించారు. వైఎస్‌ హయాంలోనే జీవోలను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టారు. తండ్రి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన జగన్‌ ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. జగన్‌ నిర్ణయాలతో వైయస్‌ ఆత్మ క్షోభిస్తుందని వ్యాఖ్యానించారు. బతికున్న చెల్లికి ఎలాగూ న్యాయం చేయలేదని…వైఎస్‌ను కూడా జగన్‌ అవమానించడం బాధాకరమన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాలు చేస్తూ జీవోలు విడుదల చేస్తారని ఆయన తెలిపారు. వాటిని రహస్యంగా ఉంచారంటే… అవినీతిని ప్రోత్సహిస్తున్నారా అని నిలదీశారు. ఇది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమన్నారు. సూట్‌ కేసుల కార్పొరేషన్‌లతో రాష్టాన్న్రి దివాళా తీయించారని మండిపడ్డారు. మిషన్‌ ఏపీ, బిల్డ్‌ ఏపీ పేరుతో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడతారా అని నిలదీశారు. ఆస్తులు అమ్మి పధకాల పేరుతో ఎలా పంచుతారని అడిగారు. విలువైన ఆస్తులను కొట్టేయడానికే ఈ అమ్మకాల నిర్ణయమని జనసేన నేత అన్నారు. బినావిూ పేర్లతో దోచుకోవడానికే కొత్త కార్పొరేషన్‌లన్నారు. గతంలో సూట్‌ కేసు కంపెనీలు పెట్టి జగన్‌ కోట్లు దోచుకున్న వైనం అందరకీ గుర్తుందని తెలిపారు. మళ్లీ ఇప్పుడు అదే తరహా మోసాలకు జగన్‌ తెర లేపారని ఆరోపించారు. పోలీసు, కార్పొరేషన్‌, భూములు అమ్మకాల వివరాలు ఎందుకు బయటకు చెప్పడం లేదని ప్రశ్నించారు. కాన్ఫడెన్షియల్‌ పేరుతో బ్లాంకు జీవోలు ఇస్తారా అని ఆయన అన్నారు. చీకటి రాజ్యం, దొంగల రాజ్యంగా మార్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన
ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సలహాదారుల పాలనే తప్ప, మంత్రుల పాలన సాగడం లేదని విమర్శించారు. జగన్‌కి అప్పులు చేయడమే తప్ప.. అభివృద్ధి వైపు ఆలోచన లేదన్నారు. అవినీతికి, దోపిడీకి కేరాఫ్‌ అడ్రస్‌గా జగన్మోహన్‌ రెడ్డి నిలిచారన్నారు. పోలవరం వంటి ప్రాజెక్టుల పరిశీనలకు మంత్రులు వెళ్లే అవకాశం లేదని… సీఎం నియమించుకున్న సలహాదారులు పరిశీలిస్తారన్నారు. మంత్రులు పరిస్థితి ఉత్సవ మూర్తులు కన్నా అన్యాయంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇసుక, మైనింగ్‌, భూ వివాదాలు చూడటమే మంత్రులు, ఎమ్మెల్యేల పని అని పోతిన మహేష్‌ యెద్దేవా చేశారు. ప్రజా సమస్యలు, అభివృద్ధిపై మాత్రం మంత్రులకు పట్టదన్నారు. అందిన కాడికి దోచుకుని… ఇళ్లల్లో కూర్చోవడమే వీరి పని అని అన్నారు. మంత్రులకు కనీస విలువ లేకుండా పోయిందన్నారు. దళిత మహిళకి హోంమంత్రి ఇచ్చామని గొప్పలు చెప్పుకున్నారని…హోం మంత్రికి ఒక హోం గార్డు కూడా మర్యాద ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. పోలీసు శాఖను సజ్జల రామకృష్ణా రెడ్డి నడిపిస్తున్నారని అన్నారు. దళితులను జగన్‌ గౌరవిస్తున్నాడా… అవమానిస్తున్నాడా అని ప్రశ్నించారు. అమ్మాయిలపై దారుణాలు పెరిగిపోతున్నా.. ప్రభుత్వానికి పట్టదన్నారు. స్వాతంత్య దినోత్సవం రోజు రమ్యను ప్రేమోన్మాది హతమార్చాడని… నేరస్తులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకం పెరిగిపోయిందని అన్నారు. బాధిత కుటుంబాలకు పది లక్షలు ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నించిన ఆయన గన్‌ కన్నా ముందు జగన్‌ వస్తారాని ప్రచారం చేశారని, ఆయన తాడేపల్లి ప్యాలెస్‌ గేటు కూడా దాటడం లేదని దుయ్యబట్టారు. జగన్‌పై పెట్టుకున్న నమ్మకం పోయిందని గెలిపించిన వారే గేలి చేస్తున్నారన్నారు. ప్రతి సమాచారం ప్రజలకు తెలియ చెప్పాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. సమాచార హక్కు చట్టం అమలుపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. బ్లాంక్‌ జీవోలపై నాదెండ్ల మనోహర్‌ కూడా ప్రభుత్వాన్ని నిలదీశారని తెలిపారు. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌పై ప్రజల్లో నమ్మకం పెరిగిందని చెప్పారు. వచ్చే ఎన్నికలలో జగన్‌ ఫ్యాన్‌ రెక్కలు విరగ్గొట్టి ప్రజలు బుద్ది చెబుతారని పోతిన వెంకట మహేష్‌ హెచ్చరించారు.