జూన్‌ 2 తర్వాత..  తెలంగాణకే హైదరాబాద్‌ రాజధాని


` ఉమ్మడి రాజధానికి ఇక చెల్లుచీటి..!
` ఏపీకి కేటాయించిన భవనాలు రాష్ట్రం ఆధీనంలోకి..
` ఆస్తులు, అప్పులు, పెండిరగ్‌ అంశాలపై త్వరలో నివేదిక
` పునర్విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించుకోవాలి : సీఎం రేవంత్‌ రెడ్డి
` ఈ నెల 18న తెలంగాణ కేబినెట్‌ సమావేశం
చారిత్రక హైదరాబాద్‌ నగరం ఇక తెలంగాణకే సొంతం కానుంది. ఇన్నాళ్లూ ఉమ్మడి రాజధానిగా ఇరుప్రాంతాల పాలనాపరమైన అంశాలకు కేంద్ర బిందువుగా ఉన్న మహానగరం ఇకనుంచి తెలంగాణకే రాజధానిగా మారనుంది. అతి త్వరలోనే ఈ మార్పులు జరగనుండగా.. అందుకు సంబంధించిన ఏర్పాట్లు సైతం చకచకా సాగుతున్నాయి. అప్పులు, ఆస్తులు, ఇతర అంశాలన్నింటిపైనా సమగ్ర నివేదికల దరిమిలా పునర్విభజన చట్టం తాలూకు వ్యవహారాలు త్వరలోనే కొలిక్కి రానున్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్‌, మే 15 (జనంసాక్షి):జూన్‌ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు మొదలు ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండిరగ్‌ అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. షెడ్యూలు 9, షెడ్యూలు 10లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్తు సంస్థల బకాయిలు ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.
రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీల వంటి అంశాలు పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలని, పీటముడి పడిన అంశాలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. పదేండ్లు పూర్తవనుండటంతో పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనుంది. ఈ పదేండ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్‌ వ్యూ గెస్ట్‌ హౌజ్‌ వంటి భవనాలను జూన్‌ 2 తర్వాత రాష్ట్ర అధీనంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పునర్విభజన చట్ట ప్రకారం పెండిరగ్లో ఉన్న అంశాలు, ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకున్న వివరాలపై సమగ్రమైన నివేదికను తయారు చేయాలని ఆదేశించారు.
ఈ నెల 18వ తేదీన శనివారం రాష్ట్ర కేబినేట్‌ సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందులో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండిరగ్లో ఉన్న అంశాలు, ఏపీతో పీటముడిగా ఉన్న అంశాలను చర్చించనున్నారు. వీటితో పాటు రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్‌ పంటల ప్రణాళికపై చర్చించనున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగియటంతో ముఖ్యమంత్రి ప్రజా పాలనపై దృష్టి కేంద్రీకరించారు. బుధవారం మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

 

రైతు రుణమాఫీకి కసరత్తు
` ధాన్యం కొనుగోళ్లు వ్యవసాయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
హైదరాబాద్‌(జనంసాక్షి): ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌లోని సచివాలయంలో సవిూక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షకు మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హావిూ ఇచ్చిన మేరకు అనుసరించాల్సిన కసరత్తుపైనా సవిూక్షించారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సచివాలయంలో వివిధ అంశాలపై కీలక సవిూక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికారులతో సమాలోచనలు జరిపారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోవడం ధాన్యం తడిసిపోవడంపై ఏం చేయాలనే అంశంపై చర్చించారు. వర్షాలు కారణంగా తడిసిన ధాన్యం కొనుగోలుపై ఎలాంటి ఆదేశాలివ్వాలనే దానిపైనా సీఎం, మంత్రులు సమాలోచనలు జరిపారు. రానున్న సాగు సీజన్‌కు సంబంధించి ఎలా సన్నద్ధం కావాలనే విషయంపై అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. విత్తనాలు సిద్ధం చేయడం, నకిలీ విత్తనాలు కట్టడిపై అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హావిూ ఇచ్చిన మేరకు అనుసరించాల్సిన కసరత్తుపైనా సవిూక్షించారు. రైతు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్‌ ఏర్పాటు, కమిషన్‌కు ఉండాల్సిన ఆదాయ వనరులు, బ్యాంకుర్ల షరతులపైనా వివరాలను అధికారుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విచారించారు.రెండు నెలలుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా వివరాలు తెలుసుకున్నారు. ఎంత ఆదాయం సమకూరింది? కేంద్రం నుంచి వచ్చిన నిధులు, చెల్లించాల్సిన అప్పులు, వడ్డీలపైనా ఆరా తీశారు. ఆరు గ్యారెంటీలు అమలుపై చర్చిస్తున్న సీఎం రేవంత్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.