జూబ్లీహిల్స్‌ రేసులో నలుగురు

` ఉప ఎన్నికల అభ్యర్థుల జాబితా ఖరారు చేసిన కాంగ్రెస్‌
` కసరత్తు పూర్తి చేసిన పార్టీ రాష్ట్ర నాయకత్వం
హైదరాబాద్‌(జనంసాక్షి):జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు పూర్తి చేసింది. నలుగురి పేర్లతో జాబితాను ఖరారు చేసినట్లు సమాచారం. షార్ట్‌ లిస్టులో నవీన్‌యాదవ్‌, సీఎన్‌ రెడ్డి, బొంతు రామ్మోహన్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. నలుగురి పేర్లతో కూడిన జాబితాను అధిష్ఠానానికి పంపనుంది. ఈ జాబితాను పరిశీలించి.. జూబ్లీహిల్స్‌ అభ్యర్థిని ఏఐసీసీ ప్రకటించనుంది.ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఈ సాయంత్రం దిల్లీ వెళ్లనున్నారు. ఆయనతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ సైతం వెళ్లనున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో కేసు దృష్ట్యా ఈ నేతల దిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. దిల్లీలోని సీనియర్‌ న్యాయవాదులను కలిసి.. బలమైన వాదనలు వినిపించేలా వారితో చర్చించనున్నట్లు సమాచారం.