జేఎన్‌యూ విద్యార్థిపై భాజపా ఎమ్మెల్యే దాడి

5

– పాటియాల కోర్టు వద్ద ఘటన

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 15(జనంసాక్షి): జేఎన్‌యూ వివాదం ఢిల్లీ కోర్టు ప్రాంగణాన్ని రణరంగం చేసింది. అక్కడికి వచ్చిన లాయర్లు కొంతమంది జేఎన్‌యూవిద్యార్థులపై, టీచర్లపై

దాడులు చేశారు. కాళ్లతో తన్నుతూ, చేతులతో గుద్దుతూ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారు. అసలు దేశానికి వ్యతిరేకంగా ఎలా ర్యాలీలు నిర్వహిస్తారని హెచ్చరిస్తూ భౌతికదాడులకు దిగారు. ఈ చర్యలను చూస్తూ పోలీసులు మిన్నకుండిపోయారే తప్ప ఏ ఒక్కరూ అడ్డుకునే సాహసం చేయలేదు. సాక్షాత్తు బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ కూడా ఓ గుర్తు తెలియని వ్యక్తిని కొట్టారు.దేశ ద్రోహానికి పాల్పడ్డాడనే ఆరోపణల కిందట జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్‌ మరికొందరు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

వారిని సోమవారం ఢిల్లీలోని పాటియాలా కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకురావడానికి కొద్ది సేపటి ముందే ఏబీవీపీ, ఏఐఎస్‌ఎఫ్‌ కార్యకర్తలకు మధ్య కోర్టు ప్రాంగణంలో ఘర్షణ ప్రారంభమైంది. అనంతరం ఇందులో అక్కడికి చేరుకున్న కొంతమంది న్యాయవాదులు కూడా ఏబీవీపీ కార్యకర్తలతో కలిసి అక్కడి విద్యార్థులు, టీచర్లపై దాడులు చేశారు. ఈ ఘటనలను వీడియో తీస్తున్న జర్నలిస్టులపై కూడా వారు తమ ప్రతాపాన్ని చూపించారు. వారి చేతులోని మొబైల్‌ ఫోన్స్‌ లాక్కోని పగులగొట్టారు. ఈ ఘటనపట్ల పలు వర్గాల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.