టిక్కెట్ల పంపిణీలో జైపాల్‌తో డికె కు విభేదాలు
మహబూబ్‌నగర్,నవంబర్19(జనంసాక్షి): ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. డీకే అరుణకు జైపాల్ రెడ్డి అడ్డుకట్ట వేసేందుకు గట్టిగా ప్రయత్నించినప్పటికీ అది విఫలమైందనే చెప్పొచ్చు. ఎందుకంటే.. దేవరకద్ర, కొల్లాపూర్, నారాయణపేట నియోజకవర్గాల్లో తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేందుకు డీకే అరుణ తీవ్ర ప్రయత్నాలు చేసి సఫలీకృతమైంది. దేవరకద్ర నుంచి డోకూరు పవన్ కుమార్ కు, కొల్లాపూర్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు.
అయితే నారాయణపేట నుంచి కుంభం శివకుమార్ రెడ్డి టికెట్ ఇవ్వాలని డీకే అరుణ గట్టిగా ప్రయత్నాలు చేసింది. కానీ ఈ నియోజకవర్గం నుంచి తన అనుచరుడైన వామనగారి కృష్ణకు టికెట్ ఇప్పించుకున్నారు జైపాల్ రెడ్డి. కొల్లాపూర్ నుంచి జగదీశ్వర్ రావుకు టికెట్ ఇవ్వాలని జైపాల్ రెడ్డి అధిష్టానానికి విన్నవించినప్పటికీ.. ఆ స్థానం విషయంలో అరుణ మాటనే నెగ్గింది. ఇలా డీకే అరుణ, జైపాల్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. నారాయణపేట టికెట్ వామనగారి కృష్ణకు ఇవ్వడంపై డీకే అనుచరులు
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నారాయణపేటలో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ఫ్లెక్సీలను అరుణ అనుచరులు ధ్వంసం చేసి.. జైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.