టిటిడి ఛైర్మన్‌గా మరోమారు వైవి సుబ్బారెడ్డి ప్రమాణం


వైవితో ప్రమాణం చేయించిన ఇవో జవహర్‌ రెడ్డి
తన పూర్వ జన్మ సుకృతం అన్న సుబ్బారెడ్డి
తిరుమల,ఆగస్ట్‌11(జనం సాక్షి): తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి బోర్డు చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండోసారి ప్రమాణ స్వీకారం చేసారు. టీటీడీ ఈవో జవహర్‌ రెడ్డి.. వైవీ చేత ప్రమాణం చేయించారు.
ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడిన వైవి సుబ్బారెడ్డి.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రథమ సేవకుడిగా రెండో సారి అవకాశం రావడం తన పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. గత రెండేళ్లుగా సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ.. మెరుగైన సౌకర్యాలు కల్పించామని ఆయన తెలిపారు. స్వామి వారీ సేవ చేసుకొనే భాగ్యం రెండోసారి దక్కడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. ’కరోనా కారణంగా చాలా పనులు చేయలేకపోయాం.. వాటిని ఇప్పుడు చేసేందుకు కృషి చేస్తాం. కరోనా నుంచి ప్రజలకు విముక్తి కలిగే విధంగా తిరుమలలో నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తాం. పర్యావరణ పరిరక్షణ కోసం ఘాట్‌ రోడ్లలో ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రారంభిస్తాం. శ్రీవారికి ఇకపై గో ఆధారిత నైవేద్యాన్ని సమర్పిస్తాం. గుడికో గోమాత కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆలయానికి గో మాతను పంపిణీ చేస్తాం.
సామాన్య భక్తులకు త్వరితగతిన మెరుగైన దర్శనం కల్పించేందుకు ప్రయత్నం చేస్తాం. కోవిడ్‌ తీవ్రత తగ్గేవరకు నిభందనలు పాటించవలసిందేనని అన్నారు. అధికారులతో చర్చించి 15 రోజుల్లో సర్వదర్శనం ప్రారంభిస్తాం. దళారీ వ్యవస్థను పూర్తిగా అరికడతాం. త్వరలోనే కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. రాష్ట్రంలోని ఆలయాలకు ధూపదీప నైవేధ్యానికి నిధులు కేటాయిస్తాం. శ్రీవాణి ట్రస్ట్‌ నిధులతో పురాతన ఆలయాలను పునరుద్దరిస్తాం’ అని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. సామాన్య భక్తులకు శీఘ్రంగా స్వామి వారి దర్శనం కల్పించడంలో విజయవంతం అయ్యామని అన్నారు. తిరుమలలో చారిత్రాత్మక నిర్ణయాలు, మార్పులు తీసుకు రావడంతో పాటు వాటిని అమలు చేసామని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలంతా ఇబ్బందులకు గురి అవుతున్న సమయంలో దర్శనాలు కూడా కుదించాల్సి వచ్చిందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమలలో ప్లాస్టిక్‌ పూర్తిగా బ్యాన్‌ చేసి పర్యావరణ పరిరక్షణ దిశగా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, మధుసూధన్‌ రెడ్డి పాల్గొన్నారు.